ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుంది

ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుంది

ఓట్ల కోసం కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుందని విమర్శించారు ప్రధాని మోడీ. అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌.. కేరళలో అదే పార్టీతో తలపడుతోందంటూ ఆ పార్టీ విధానాన్ని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడిందని.. ఓట్ల కోసం ఎవరితోనైనా చేతులు కలిపేందుకు సిద్ధమైందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి, అక్రమాల కారణంగా రాష్ట్రం ఇతర ప్రాంతాలతో అనుసంధానాన్ని కోల్పోయిందన్నారు మోడీ. బీజేపీ మాత్రం అసోం ప్రజల్ని మిగతా దేశంతో ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున ఊపందుకున్నాయన్నారు.

ఆయుష్మాన్‌ యోజన పథకం కింద ఇప్పటి వరకు అసోంలో 1.5 లక్షల మంది ఉచిత వైద్యం పొందారన్నారు. అలాగే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా 27 లక్షల మంది రైతులు లబ్ధి పొందారన్నారు. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మొత్తం మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది.