వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై ఇప్పట్నుంచే ఫోకస్ పెట్టారు BSP అధ్యక్షురాలు మాయావతి. మాఫియాతో సంబంధం ఉన్న వ్యక్తులు, బాహుబలిగా పిలిచే లోకల్ డాన్లకు టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. BSP కీలక నేతల్లో ఒకరైన ముఖ్తార్ అన్సారీ ప్రస్తుతం జైళ్లో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ లోనే అతిపెద్ద నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్లో అతను కూడా ఒకరు. అతను ప్రస్తుతం మావు నియోజకవర్గ BSP
ఎమ్మెల్యే కూడా. 1996 నుంచి మావు నియోజకవర్గంలో అతడే ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. అయితే వచ్చే ఎన్నికల్లో ముఖ్తార్ అన్సారీకి టికెట్ ఇవ్వబోమని మాయావతి ప్రకటించారు. మావు నియోజకవర్గం నుంచి ఉత్తరప్రదేశ్ BSP అధ్యక్షుడు భీమ్ రాజ్ భర్ పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
ముఖ్తార్ అన్సారీ BSPలో రాజకీయ ప్రస్తానం ప్రారంభించాడు. అయితే 2002లో పార్టీ నుంచి వెళ్లిపోయాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచాడు. 2007లోనూ ఇండిపెండెంట్ గా రెండోసారి గెలిచాడు. 2012లో క్వామి ఏక్తా దల్ పార్టీలో చేరి... ఎమ్మెల్యేగా గెలిచాడు. 2015, 16 నుంచి అతనికి కష్టకాలం మొదలైంది. అప్పట్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని... సమాజ్ వాదీ ప్రభుత్వం ముఖ్తార్ అన్సారీపై కేసులు పెట్టింది. దీంతో 2017లో మళ్లీ BSPలో చేరాడు అన్సారీ. అప్పట్లో అన్సారీని బాగా వెనకేసుకొచ్చారు మాయావతి. సమాజ్ వాదీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. ముఖ్తార్ అన్సారీపై మర్డర్, కిడ్నాప్ సహా 50కి పైగా కేసులున్నాయి. 2005 నుంచి ఉత్తరప్రదేశ్ లోని వేర్వేరు జైళ్లలోనే ఉంటున్నాడు. జైళ్లో ఉండి కూడా ఎన్నికల్లో గెలిచాడు ముఖ్తార్ అన్సారీ.
