ఘట్​కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్​పై అవిశ్వాసం

ఘట్ కేసర్, వెలుగు:  ఘట్​కేసర్​మున్సిపల్​చైర్​పర్సన్​ ముల్లి పావని జంగయ్య యాదవ్​ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, స్థానిక నర్సరీ స్థలాన్ని ప్రైవేట్​వ్యక్తికి అప్పగించేందుకు కోటిన్నర డీల్​కుదుర్చుకున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. శనివారం మెజారిటీ సభ్యులు కలిసి అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేసి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియకి అందజేశారు. బీఆర్ఎస్ కు చెందిన పావనిపై అదే పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు అసమ్మతి తెలపడం చర్చనీయాంశమైంది. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ.. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పావని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టేందుకు రూ.1.5 కోట్లకు డీల్ కుదుర్చుకున్న ఆడియో బయటకు వచ్చిందని చెప్పారు. చైర్​పర్సన్​పై అవిశ్వాసానికి రెడీ అయినవారిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లతోపాటు కాంగ్రెస్​కౌన్సిలర్లు ఉన్నారు. 

మున్సిపాలిటీలో మొత్తం 18 మంది సభ్యులు ఉండగా, 12 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసుపై సంతకాలు చేశారు. త్వరలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు డీఆర్ఓ తెలిపారు. అయితే చైర్ పర్సన్ పావని తన పదవి పోతుందని ముందే తెలిసి,  తనని కాంగ్రెస్​లో చేర్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్​చార్జ్​వజ్రేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అవిశ్వాసం నెగ్గితే మూడో వార్డు కౌన్సిలర్ బొక్క సంగీతకు చైర్ పర్సన్ పదవి దక్కుతుందని చెప్పుకుంటున్నారు.