శివలింగంపై నిజాం శిలా శాసనం

అమ్రాబాద్, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో నిజాం కాలం నాటి శాసనం బయట పడినట్లు చరిత్ర బృందం కన్వీనర్  హరగోపాల్  తెలిపారు. అమ్రాబాద్  మండలం కొల్లంపెంట సమీపంలోని అడవిలో శివలింగంపై పార్శీ, తెలుగు భాషలో నిజాం శాసనం చెక్కబడి ఉందని చెప్పారు. 

చరిత్రలో ఇలాంటి శాసనం ఎక్కడా లేదన్నారు. శాసన సారాంశం ప్రకారం.. హైదరాబాద్ రాజ్య నవాబు(8వ) నిజాముల్  ముల్క్  ఆసఫ్ హా, ముకరం ఉద్  దౌల్ బహదూర్ కొలువులోని జైన్  చంద్ర అనే సుంకం అధికారి 1932 ఏప్రిల్ 9న ఇక్కడి బంజర్  భూమిలో మొక్కలు నాటించినట్లు శాసనం చెక్కబడి ఉంది. అదే శివలింగంపై తెలుగులో కూడా శాసన పంక్తులు కనిపిస్తాయి. ఈ శాసనంపై ఉన్న పార్శీ భాషను చరిత్ర బృందం అబ్బాస్  అలీ, అబ్దుల్ వాహెద్, అబ్దుల్ బాసిత్  అనువాదం చేశారు. ఈ శాసనం వెలుగులోకి రావడానికి కందుల వెంకటేశ్, దాసరి మల్లేశ్, సతీశ్, గాంధీ, గాజుల బసవరాజు, నరసింహులు సహకరించినట్లు ఆయన తెలిపారు.