నితీష్.. నితీష్.. నితీష్.. ఇప్పుడు ఇండియా అంతా.. కాదు కాదు.. ప్రపంచమంతా ఇదే పేరు. క్రికెట్ ప్రపంచంలో నితీశ్ కుమార్ రెడ్డి పేరు మార్మోగిపోతోంది. మెల్బోర్న్ టెస్టులో మెయిడెన్ టెస్టు సెంచరీతో ఒక్కసారిగా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అయితే నితీష్ ఇంతటి సక్సెస్ సాధించడం వెనుక తన తండ్రి ఎనలేని కృషి ఉందని చాలా మందికి తెలియదు. నితీష్ తండ్రి ముత్యాలరెడ్డి త్యాగం గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. నితీష్ ను అంతర్జాతీయ క్రికెట్ స్టార్ చేసిన తన తండ్రి ఏం చేస్తుంటారు.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్నలు.
నితీష్ కుమార్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం. అతని తండ్రి ముత్యాల రెడ్డి హిందూస్తాన్ జింక్‌లో ఉద్యోగం చేసేవారు. నితీష్ రెడ్డి ఐదేళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. తండ్రి పని చేసే హిందూస్తాన్ జింక్ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ గ్రౌండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగాడు నితీశ్ కుమార్ రెడ్డి. ప్లాస్టిక్ బాల్‌తో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఇదే సమయంలో నితీష్ తండ్రి ముత్యాలరెడ్డికి ఉదయ్‌పూర్ బదిలీ అయ్యింది.
కొడుకు కెరీర్ కోసం ఉద్యోగానికే రాజీనామా..
కొడుకు ఆట మీదున్న అపారమైన నమ్మకం.. నితీష్ ను గొప్ప క్రికెటర్ ను చేయాలన్న కసి ఆయన సంచలన నిర్ణయం తీసుకునేలా చేసింది. కొడుకు కెరీర్ కోసం ఏకంగా ఉద్యోగానికి రాజీనామ చేశారు. అతను రాజీనామా చేసే సమయానికి.. అతనికి ఇంకా 25 ఏళ్ల సర్వీస్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం.. అయినా కూడా.. కొడుకు కెరీర్ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నారు. కొడుకు పట్టుదలపై అతని నమ్మకం అలాంటిది. అప్పటి నుంచి నితీష్ కుమార్ రెడ్డికి... అన్నీ తానై ఉన్నాడు.. వెంటే ఉన్నాడు. క్రికెట్ లో నిలదొక్కుకోవటం కోసం చేయాల్సిన కృషి అంతా చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే.. కోచ్ కంటే ఎక్కువగా.. తల్లి కంటే మిన్నగా నితీష్ క్రికెట్ జీవితాన్ని తీర్చిదిద్దాడు అనటంలో సందేహం లేదు.
తండ్రి నమ్మకాన్ని నిలబెట్టిన నితీష్..
తన కోసం జీవితాన్ని త్యాగం చేసిన తన తండ్రి నమ్మకాన్ని నితీష్ వమ్ము చేయలేదు. 2019 -20 రంజీ సీజన్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీతో 366 పరుగులు చేశాడు. దీంతో అందరి దృష్టిలో పడ్డాడు నితీశ్.
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న నితీష్ కుమార్ రెడ్డిపై అందరి ఫోకస్ పడింది. దీంతో నితీశ్ ని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో అసాధారణ ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ కుమార్ రెడ్డి.. ఆస్ట్రేలియా పర్యటనతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు.
వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకొని జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కొడుకుపై నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి అతని కెరీర్‌కు అండగా నిలిచిన ముత్యాల రెడ్డికి నెటిజన్లు సలామ్ చేస్తున్నారు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకొని ఏకాగ్రతతో సక్సెస్ సాధించిన నితీష్ ను కూడా అభినందిస్తున్నారు. తన కొడుకు ఖచ్చితంగా సాధిస్తాడని ఉద్యోగాన్ని వదిలేయడం అంటే మాటలు కాదు. ఆ విషయంలో ముత్యాలరెడ్డి త్యాగానికి, నమ్మకానికి సలాం కొట్టాల్సిందే. మరో విషయం.. నితీష్.. తండ్రి మాటను నిలబెట్టడం.. ఆ తండ్రికి అంతకు మించిన గర్వకారణం ఏముంటుంది. హ్యాట్సాఫ్ టు యు బోత్ ముత్యాలరెడ్డి అండ్ నితీష్ కుమార్ రెడ్డి.