IND vs AUS: తెలుగు కుర్రాడు సూపర్ డెలివరీ.. కీలక వికెట్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన నితీష్

అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి టెస్ట్ క్రికెట్ లో రెండో వికెట్ తీసుకున్నాడు. భారత బౌలర్ల సహనాన్ని గంటలపాటు పరీక్షించిన మార్నస్ లబుషేన్ వికెట్ తీసుకొని టీమిండియాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 55 ఓవర్ మూడో బంతిని నితీష్ ఆఫ్ కట్టర్ వేశాడు. దీన్ని కట్ చేద్దామని భావించిన మార్నస్.. స్లిప్ లో జైశ్వాల్ పట్టిన క్యాచ్ కు ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 126 బంతులాడిన లబుషేన్.. 9 ఫోర్లతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు.          

డిన్నర్ కు ముందు ఈ వికెట్ భారత జట్టులో ఫుల్ జోష్ నింపింది. టెస్ట్ క్రికెట్ లో నితీష్ కి ఇది రెండో వికెట్. పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో అతను మిచెల్ మార్ష్ ను ఔట్ చేసి టెస్ట్ క్రికెట్ లో తొలి వికెట్ పడగొట్టాడు. ఈ సిరీస్ లో వచ్చిన అవకాశాలను నితీష్ అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాడు. బ్యాటింగ్ లో ప్రతి ఇన్నింగ్స్ లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. పెర్త్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో.. అడిలైడ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

Also Read:-అట్కిన్సన్ అదరహో.. టెస్టుల్లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ హ్యాట్రిక్

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతుంది. డిన్నర్ కు ముందు ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.  ప్రస్తుతం ఆసీస్ జట్టు 5 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. గ్రీజ్ లో మార్ష్ (0), హెడ్ (49) ఉన్నారు. మార్నస్ లబుషేన్ 64 పరుగులు చేసి రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. నితీష్ రెడ్డికి ఒక వికెట్ దక్కింది.