‘అలీబాబా’లా మనకో పోర్టల్​: నితిన్ గడ్కరీ

‘అలీబాబా’లా మనకో పోర్టల్​: నితిన్ గడ్కరీ

అమెజాన్‌ స్థాయి ఈ-కామర్స్‌‌ పోర్టల్‌‌ను నిర్మిస్తాం
ఎంఎస్ఎంఈలు భారీగా ఉద్యోగాలు ఇవ్వాలి
కేంద్ర ఎంఎస్ఎంఈల మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: ‘చైనా ఆర్థికాభివృద్ధికి అక్కడి ఈ–కామర్స్‌‌ కంపెనీ అలీబాబా ఎంతో మేలు చేసిందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా మంత్రిత్వశాఖ.. గవర్నమెంట్‌‌ ఈ–మార్కెట్‌‌ పోర్టల్‌‌ (జీఈఎం)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా కొత్త ఈ–కామర్స్ మార్కెటింగ్‌‌ పోర్టల్‌‌ను ఏర్పాటు చేస్తాం. దీనిని భారత్‌‌క్రాఫ్ట్‌‌ అని పిలుస్తాం. ఇది అమెజాన్‌‌, అలీబాబా స్థాయిలో ఉంటుంది. రాబోయే రెండేళ్లలో ఇది రూ.10 లక్షల కోట్ల టర్నోవర్‌‌ సాధించేలా చేస్తాం’’ అని కేంద్ర రవాణా, ఎంఎస్ఎంఈల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మనదేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమేనని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. .

కుటీర, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) రాబోయే ఐదేళ్లలో ఐదు కోట్ల ఉద్యోగాలను కల్పించాలని స్పష్టం చేశారు. లేకపోతే మరో ఐదేళ్లలో ఐదు ట్రిలియన్‌‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించడం సాధ్యం కాదని అన్నారు. మన జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 29 శాతం కాగా, గత కొన్నేళ్లలో ఇవి 11 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. అయితే జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 50 శాతానికి పెరిగితేనే లక్ష్యాలను సాధించగలుగుతామని మంత్రి అన్నారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్‌‌ ఎంఎస్ఎంఈ ఎక్స్‌‌పోలో ఆయన మాట్లాడుతూ మార్కెటింగ్‌‌, పేమెంట్ల విషయంలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని నితిన్​ గడ్కరీ అన్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి..