నిస్సాన్ కార్ల కంపెనీ: 1,700మందిపై వేటు

నిస్సాన్ కార్ల కంపెనీ: 1,700మందిపై వేటు

ఇప్పటికే 1,700మందిపై వేటు

ముంబై : ప్రపంచవ్యాప్తంగా నిస్సాన్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు కంపెనీ ఎవరికి పింక్ స్లిప్స్ ఇస్తుందోనని… ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. తాజాగా నిస్సాన్ మోటార్, ఇండియాలో పనిచేసే 1,700కి పైగా ఉద్యోగులపై వేటు వేసేసింది. గ్లోబల్‌‌గా 12,500మంది ఉద్యోగులను నిస్సాన్ తీసివేయాలని  నిర్ణయించిన క్రమంలో వారిపై వేటు పడింది. గ్లోబల్‌‌గా ఇప్పటికే 6,400 మందికి పైగా ఉద్యోగులను నిస్సాన్ తీసేసినట్టు తెలిసింది. మిగతా వారిని వచ్చే రెండు లేదా మూడేళ్లలో తీసేయనున్నట్టు తెలుస్తోంది. తొలగిస్తున్న మొత్తం వర్క్‌‌ఫోర్స్‌‌లో ఇండియాకు చెందిన వారు 13.5 శాతం ఉన్నారు. టోక్యోలో ఇన్వెస్టర్లకు ఇచ్చిన ప్రజంటేషన్‌‌లో కంపెనీ, తన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్కర్లకు పింక్ స్లిప్స్‌‌ను ఇస్తున్నట్టు తెలిపింది. ఇండియా కాకుండా.. అమెరికా నుంచి 1,420 మంది ఉద్యోగులను, మెక్సికో నుంచి వెయ్యి మందిని, ఇండోనేషియా నుంచి 830 మందిని, జపాన్‌‌లోని తనకున్న రెండు ప్లాంట్ల నుంచి 880 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

తగ్గిపోయిన నిస్సాన్ ఇండియా విక్రయాలు….

ఖర్చులను తగ్గించుకునేందుకు ఎంప్లాయీ వాలంటరీ సెపరేషన్ స్కీమ్ ను కూడా నిస్సాన్ మోటార్ ఇండియా గతేడాది సెప్టెంబర్‌‌‌‌లోనే ప్రకటించింది. ఆరు నెలల క్రితమే ఉద్యోగులను తొలగించే ప్రక్రియను నిస్సాన్ మోటార్ ప్రారంభించిందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. నిస్సాన్ మోటార్‌‌‌‌కు ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌‌లో అంతగా కలిసి రావడం లేదు. డాట్సన్‌‌వైపుకి ఫోకస్ మార్చే సరికి మదర్ బ్రాండ్ నిస్సాన్ వెనుకంజలో పడిపోయింది. డాట్సన్‌‌ బ్రాండ్ కూడా ఇండియాలో మరికొన్ని లగ్జరీ కారు బ్రాండ్ల కంటే తక్కువగానే అమ్ముడుపోతున్నది. నిస్సాన్ మదర్ బ్రాండ్‌‌కు మళ్లీ పునర్ వైభవం తెచ్చేందుకు కిక్స్ ఎస్‌‌యూవీ లాంచ్ చేసినా.. ఫలితం లేకుండాపోయింది. 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నిస్సాన్ మోటార్ ఇండియా విక్రయాల్లో 30 శాతం పడిపోయి 36,525 యూనిట్లనే అమ్మింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కూడా నిస్సాన్ మోటార్ ఇండియా సేల్స్ 5 వేల యూనిట్లు తగ్గాయి. మార్కెట్ షేరు కేవలం 0.75 శాతంగా ఉంది.  లాభాలు కూడా పదేళ్ల కనిష్ట స్థాయులకు పడిపోయాయి.