- కానరాని కార్యకలాపాలు
- భారమవుతున్న నెల వారీ ఖర్చులు
- ఇంటి నుంచే పనులు చక్కబెడుతున్న ఎమ్మెల్యేలు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. నిర్మల్, ఖానాపూర్, బైంసాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును రూ. కోటితో నిర్మించింది. రూ. 20 లక్షల వరకు వెచ్చించి ఫర్నిచర్ ను కూడా ఏర్పాటు చేశారు. విశాలమైన గదులు, ఖాళీ ఆవరణ ఉండేట్లు డిజైన్ చేశారు.
ఈ క్యాంప్ ఆఫీసులు వాస్తుకు లేవన్న ప్రచారం జరగడంతో అప్పటి బీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యేలు ఒకటి రెండు సార్లు తప్పా ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్మించినా ఈ ఆఫీసులకు రోజూ తాళాలే దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలకు ఎలాంటి పని ఉన్నా ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు వెళుతున్నారు. దీంతో కోట్లు వెచ్చించి నిర్మించిన క్యాంపు ఆఫీసులు నిరుపయోగంగా మారాయి.
భారమవుతున్న ఆస్తి పన్ను, కరెంటు బిల్లులు
నిర్మల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు ఏటా రూ. 25,430 ఆస్తి పన్ను చెల్లించాల్సి వస్తోంది. గత నాలుగేళ్ల నుంచి ఆర్‌అండ్ బీ శాఖ అధికారులు మున్సిపాలిటీకి ఈ ఆస్తి పన్ను చెల్లించారు. ఈ ఏడాది ఆస్తి పన్ను మాత్రమే బకాయిగా ఉంది. బైంసా, ఖానాపూర్ క్యాంప్ ఆఫీసులకు ఒక్కో భవనానికి దాదాపు 20 వేలకు పైగా ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం మారడంతో క్యాంపు ఆఫీసులకు ఆర్అండ్‌బీ ఆఫీసర్లు కొత్త రంగులు వేయించారు. అయినా ఈ సారి గెలిచిన ఎమ్మెల్యేలు ఏడాది గడిచినా క్యాంపు ఆఫీసుల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
ALSO READ : కోఠిలో ఆశా వర్కర్ల ఆందోళనలో ఉద్రిక్తత
అందుబాటులోకి తేవాలి
కోట్ల రూపాయలతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను అందుబాటులోకి తేవాలి. ఎమ్మెల్యేలంతా తమ ఇళ్ల వద్ద కాకుండా క్యాంప్ ఆఫీసులలోనే కార్యకలాపాలు కొనసాగించాలి. క్యాంప్ ఆఫీసులు ప్రజలందరికీ అందుబాటులో ఉన్న కారణంగా వీటిని వినియోగించడం తప్పనిసరి చే యాలి. ప్రజలకు కూడా క్యాంప్ ఆఫీసులలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి. - కడపత్రి తిలక్ రావు, తెలంగాణ జన సమితి జిల్లా ప్రెసిడెంట్, నిర్మల్