వంద కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం

  • నిర్మల్​జిల్లాలో 7 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు
  • 17 మిల్లులు డిఫాల్ట్ గా గుర్తింపు
  • ఆఫీసర్ల విస్తృత తనిఖీల్లో వెల్లడి
  • మిల్లర్ల తీరుపై తీవ్ర విమర్శలు

 నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ ధాన్యం వ్యవహారం హద్దులు దాటింది. 2022–23 సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కొంతమంది రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. జిల్లాలోని 7 రైస్ మిల్లుల యజమానులు దాదాపు రూ.107 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేలింది. 2022–23 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి సీఎంఆర్ బకాయిలపై రైస్ మిల్లులను కొద్ది రోజుల క్రితం పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. 

మిల్లులకు కేటాయించిన ధాన్యం నిల్వలు మాయమైనట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. ఏడు రైస్ మిల్లులు దాదాపు రూ.107 కోట్ల విలువైన ధాన్యం నిల్వలకు సంబంధించిన లెక్కలు చూపలేదు. దీనికి తోడుగా అక్కడి రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు కనిపించకపోవడంతో అధికారులు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులతో పాటు ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

ముఖ్యంగా 2022–23 సంవత్సరానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వాలని ఆఫీసర్లు గడువు విధించడమే కాకుండా మిల్లర్లకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేయకుండా నిర్లక్ష్యం వహించి బియ్యాన్ని అప్పజెప్పలేదు. గడువు ముగిసిపోవడం, హెచ్చరికలు  బేఖారవుతుండడంతో  సివిల్ సప్లయిస్ అధికారులు రైస్ మిల్లుల తనిఖీలను చేపట్టి భారీగా ధాన్యం పక్కదారి పట్టినట్లు తేల్చారు. 

ఆ 7 మిల్లులు ఇవే..

జిల్లాలోని మొత్తం ఏడు రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. భైంసా మండలం దేగాంలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లు యాజమాన్యం 5,905 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 692 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పజెప్పారు. సారంగాపూర్ మండలం బీరవెల్లిలోని సాయికృప రైస్ మిల్ 2,845 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 912 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఇచ్చారు. ఇదే మండలం చించోలి బి గ్రామంలోని అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ 888 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 57 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పజెప్పింది.

బాసర మండలంలోని ఓ రైస్ మిల్ 6,388 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 28 మెట్రిక్ టన్నులు మాత్రమే  ఇవ్వడం పట్ల అధికారులు సీరియస్ అయ్యారు. లోకేశ్వరం మండలం జోహార్ పూర్ లో ఉన్న రాజరాజేశ్వర రైస్ మిల్లు 1672 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా 858 మెట్రిక్ టన్నులు, ఇదే మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర రైస్ మిల్ 1239 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సిన చోట కేవలం 314 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే అప్పజెప్పారు. ముథోల్ మండలం చింతకుంటలోని జై శ్రీత ఇండస్ట్రీస్ రైస్ మిల్ 3,260 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉండగా 1258 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు. ఈ మిల్లుల్లో మొత్తం రూ.107 కోట్ల సీఎంఆర్​ధాన్యం పక్కదారి పట్టింది.

తనిఖీల ఆధారంగానే చర్యలు

2022–23 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్, రబీ సీజన్ల సీఎంఆర్ బియ్యం చెల్లింపు విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సీఎంఆర్ ఇవ్వని 
7 రైసు మిల్లులపై క్రిమినల్ కేసులతో పాటు ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. గడువులోగా సీఎంఆర్ ఇవ్వకపోతే చర్యలు తప్పవు.- గోపాల్, డిస్ట్రిక్ట్ మేనేజర్,   సివిల్ సప్లయిస్, నిర్మల్