నాగ్ పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఘోరం జరిగింది. ఇక్కడి సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ బ్లాస్ట్ లో 9 మంది కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ‘‘నాగ్ పూర్ లోని బజార్ గావ్ లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా కంపెనీ ఉంది. ఈ కంపెనీలోని పేలుడు పదార్థాల తయారీ యూనిట్ లో ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బ్లాస్ట్ జరిగింది. ఆ టైమ్ లో అక్కడ 12 మంది కార్మికులు పనిచేస్తున్నారు” అని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి బిల్డింగ్ మొత్తం ధ్వంసమైందని చెప్పారు. డెడ్ బాడీలు ఇంకా పేలుడు జరిగిన బిల్డింగ్ లోపలే ఉన్నాయి. అక్కడ పేలుడు పదార్థాలు ఉండడంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా ఆ పేలుడు పదార్థాలను వేరే చోటుకు తరలిస్తున్నారు. ఆ తర్వాతే డెడ్ బాడీలను బయటకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీ బయట అంబులెన్స్ లను రెడీగా ఉంచామని చెప్పారు.
బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన..
పేలుడు విషయం తెలిసి మృతుల కుటుంబసభ్యులు, కార్మికులు, స్థానికులు దాదాపు 200 మంది కంపెనీ ఎంట్రెన్స్ గేట్ వద్ద గుమిగూడారు. తమవాళ్ల మృతదేహాలను చూసేందుకు తమను లోపలికి అనుమతించాలని ఆందోళన చేశారు. అయితే, పోలీసులు అనుమతించకపోవడంతో కంపెనీ ఎదుట అమరావతి–నాగ్ పూర్ హైవేపై బైఠాయించారు. పోలీసులు వాళ్లను చెదరగొట్టి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, పేలుడు ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. చనిపోయినోళ్లలో ఆరుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.
నాకేమీ వద్దు.. నా బిడ్డ మృతదేహాన్ని అప్పగించండి..
పేలుడులో ప్రాణాలు కోల్పోయిన తమవాళ్ల డెడ్ బాడీలను అప్పగించాలంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డెడ్ బాడీలను ఇంకా బయటకు తీసుకురాకపోవడంతో కుటుంబసభ్యులు కంపెనీ గేట్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ‘‘పేలుడులో నా బిడ్డ ఆర్తి (22) ప్రాణాలు కోల్పోయింది. ఉదయం 9:30 గంటల నుంచి కంపెనీ వద్దే ఎదురుచూస్తున్నాను. నాకు నా బిడ్డ మృతదేహాన్ని అప్పగించండి” అంటూ నీలకంఠరావు సహారే కన్నీళ్లు పెట్టుకున్నారు.
