హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో లక్షల మంది పిల్లలకు కరోనా వచ్చిపోయిందంటున్నారు ఎన్‌ఐఎన్ సైంటిస్టులు. ఇటీవల చేసిన సీరో సర్వేలో చాలా మంది పిల్లలకు కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు తేలిందని చెబుతున్నారు. 10 నుంచి 17 ఏండ్ల వయసున్న పిల్లల్లో 35 నుంచి 40 శాతం మందికి యాంటీబాడీస్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. నిరుడు డిసెంబర్‌లో చేసిన సర్వేలో 19 శాతం మంది పిల్లలకు యాంటీబాడీస్ ఉన్నట్టు తేలింది. సెకండ్ వేవ్‌లో చాలా మంది వైరస్ బారిన పడడంతో ఈ సంఖ్య సుమారు 40 శాతానికి పెరిగింది. కరోనా థర్డ్ వేవ్‌లో చిన్న పిల్లలపై ప్రభావం చూపిస్తుందన్న హెచ్చరికలతో, ఈ సారి 6 నుంచి 9 ఏండ్ల వయసున్న పిల్లలపై కూడా సర్వే చేశారు. ఈ వయసు పిల్లల్లో 25 శాతం మందిలో యాంటీబాడీస్ ఉన్నాయని గుర్తించారు. తెలంగాణతో పాటు, దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్ సర్వే చేయించింది. రాష్ట్రంలో కామారెడ్డి, నల్గొండ, జనగామ జిల్లాల్లో సర్వే చేశారు. ఈ సర్వే ఫలితాలను మరో పది రోజుల్లో ఐసీఎంఆర్ వెల్లడించే అవకాశం ఉందని, ఎన్‌ఐఎన్ సైంటిస్టు, సీరో సర్వే ఇన్చార్జ్, డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు. జిల్లాల్లో కంటే గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంకా ఎక్కువ మంది పిల్లలకు యాంటీబాడీస్ ఉండొచ్చని ఆయన తెలిపారు. ఆగస్టులో గ్రేటర్‌లోనూ సర్వే చేసే అవకాశం ఉందన్నారు.
సగం మంది సేఫ్
రాష్ర్టంలో ఇప్పటికి 4 సార్లు సీరో సర్వేలు చేశారు. నిరుడు మే నెలలో తొలి రౌండ్, ఆగస్టులో రెండో రౌండ్, డిసెంబర్‌లో మూడో రౌండ్, గత నెలలో నాలుగో రౌండ్ సర్వే చేశారు. రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి (24.1% మందికి) కరోనా యాంటిబాడీస్ ఉన్నట్టు డిసెంబర్‌లో చేసిన సర్వేలో తేలింది. ఈసారి సర్వేలో ఇది 50 శాతానికి చే రిందని సైంటిస్టులు అంచనా వేశారు. గ్రేటర్ హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లోనూ సగానికి పైగా జనాలు వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మందిలో యాంటీబాడీస్ ఉండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. దీంతో థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తక్కువగానే ఉండొచ్చని చెప్తున్నారు.
