రంజిత్ రామచంద్రన్ రాంచి ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ఈ మధ్యనే సెలక్ట్ అయ్యాడు. ఆ ఉద్యోగానికి సెలక్ట్ అయిన ఆనందంలో తను పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో
ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చదివి ఎంతోమంది అయ్యో.. అనుకుంటూనే ‘శభాష’ని మెచ్చుకున్నారు కూడా. అక్కడితో ఆగకుండా ఆ పోస్ట్‌ను చాలా మందికి షేర్ చేశారు. ఇంతకూ రంజిత్ చెప్పిన కథేమిటి? ఆయన పడ్డకష్టాలేమిటి?
రంజిత్ కాసర్‌గఢ్ జిల్లాలోని పనతూర్ అనే పల్లెటూళ్లో పుట్టి పెరిగాడు. ఆ ఊళ్లో ఇప్పటికీ ఒక చిన్న గుడిసెల ఉంటాడు. మట్టి, ఇటుకలతో కట్టి ప్లాస్టర్ చేయని గోడలు.. వానొస్తే కురిసే కప్పుపై కప్పిన టార్పాలిన్‌తో ఉన్న గుడిసె ఫొటోని కూడ ఫేస్బుక్లో షేర్ చేశాడు.
తమ్ముడు.. చెల్లి చదువుల కోసం
రంజిత్ వాళ్ల నాన్న రామచంద్రన్ టైలర్. వాళ్లమ్మ బేబీ ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కూలి పనులకు పోయేది. ముగ్గురు పిల్లల్లో రంజిత్ పెద్దవాడు. పెద్దవాడు కాబట్టి రంజిత్ మీద ఇంటి బాధ్యతలు పడేవి. పెద్ద చదువులు చదవాలన్న కోరికతో ఉన్న రంజిత్ ఆర్థిక సమస్యల వల్ల చదువుని మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంటిని నడిపే భారం మీదేసుకుని కొంతకాలం చిన్న చిన్న పనులు చేశాడు. తమ్ముడు, చెల్లెలి చదువుకు ఇబ్బంది లేకుండా ఉండాలని తాను నైట్ వాచ్మెన్ జాబ్‌లో చేరాడు. బీఎస్ఎన్ఎల్ ఎక్స్ఛేంజ్ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేస్తే నెలకు నాలుగు వేల రూపాయలు ఇచ్చేవాళ్లు. కొన్నాళ్ల తర్వాత కాలేజీలో చేరాడు. ఆ కాలేజీ నుంచి వాళ్ల ఇంటికి పోకుండా నేరుగా బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫీస్‌కి పొయ్యి, ఆ రాత్రంతా అక్కడ డ్యూటీ చేసి తెల్లవారగానే ఇంటికిపోయేవాడు. ఇట్ల అయిదేళ్లు కష్టపడి పీజీ దాకా చదివిండు.
ఇంగ్లీష్ రానప్పుడు...
రంజిత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ని కాసరగఢ్లోని కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో చదివాడు. పీజీ అయిపోయినంక ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్డీ చేయడానికి పోయిండు. తనకు ఇంగ్లీష్ అంత బాగా రాదు. భాష సమస్యతో చదువు వదిలేసి మళ్లీ కాసరగఢ్కి పోవాలనుకున్నాడు. ఆ టైమ్‌లో తన గైడ్ ప్రొఫెసర్ సుభాష్, ప్రొఫెసర్ వైదేహి తనను ఎంకరేజ్ చేసి, సపోర్ట్‌చేశారు. వాళ్ల సాయంతో ఇంగ్లీష్ నేర్చుకుంటూ, రీసెర్చి చేశాడు. ఏడాది క్రితం ఎకనామిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసిండు. ఆ డిగ్రీ సాధించిన 90 రోజుల్లోనే ఐఐఎం రాంచిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో బెంగళూరులోని ‘క్రిస్టీ యూనివర్సిటీ’లో రెండు నెలలపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాబ్ చేశాడు. ఎస్టీ కులంలో పుట్టిన రంజిత్ తన చదువుల కోసం ఎన్నడూ రిజర్వేషన్ వాడుకోలేదు. మరొకరికి ఆ రిజర్వేషన్ వాడుకునే అవకాశం కల్పిస్తూ కష్టపడిన రంజిత్ విజయం పేద విద్యార్థులకు ఒక పాఠం.
