పుతిన్​ నిర్ణయంతో మార్కెట్లకు భారీ నష్టాలు

పుతిన్​ నిర్ణయంతో మార్కెట్లకు భారీ నష్టాలు
  • వరుసగా ఐదోరోజూ నష్టం!
  • 1,200 పాయింట్లు పడ్డ సెన్సెక్స్​
  • చివరికి 383 పాయింట్ల నష్టంతో క్లోజ్​ 17,100 దిగువన నిఫ్టీ
  • పుతిన్​ నిర్ణయంతో మార్కెట్లకు భారీ నష్టాలు

న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ మధ్య టెన్షన్లు మరింత ముదరడంతో మార్కెట్లు మళ్లీ ఘోర నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మంగళవారం ఇండెక్స్​లు భారీగా పడ్డాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 113 పాయింట్ల తగ్గి 17,100 దగ్గర ముగిసింది.  అంతర్జాతీయ మార్కెట్ల మాదిరే ఇండియా ఈక్విటీలు వరుసగా ఐదో రోజు నష్టాల్లో కూరుకుపోయాయి. ఉదయం ట్రేడ్​లో సెన్సెక్స్​56,438 పాయింట్ల వద్ద నెగటివ్​లో మొదలై 1,200 పాయింట్లు పడింది. నిఫ్టీ ఇంట్రాడేలో 350 పాయింట్ల వరకు తగ్గింది. అయితే చివరికి రెండూ కాస్త కోలుకోవడంతో ఇన్వెస్టర్ల నష్టం తగ్గింది.
ఎందుకు పడ్డాయంటే...
రష్యా ప్రెసిడెంట్​ పుతిన్​ తూర్పు ఉక్రెయిన్‌‌లోని రెండు   ప్రాంతాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవిగా గుర్తించడమేగాక, శాంతిపరిరక్షణ కోసం అక్కడికి వెళ్లాలని తన దళాలను ఆదేశించారు. ఈ నిర్ణయాలపై యూరప్​, అమెరికా, నాటో మండిపడ్డాయి. కఠిన చర్యలకు సిద్ధమని ప్రకటించాయి. రష్యాపై కొత్త ఆంక్షలను ప్రకటించడానికి యునైటెడ్ స్టేట్స్, దాని యూరోపియన్ మిత్రదేశాలు రెడీగా ఉన్నట్టు ప్రకటించాయి. రష్యా గుర్తించిన ప్రాంతాలకు ఆంక్షలు తప్పవని అమెరికా స్పష్టం చేసింది. దీంతో మార్కెట్లన్నీ వణికిపోయాయి. ఇన్వెస్టర్లు అలెర్ట్​ అయ్యారు. తీవ్రంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. చమురు ధర పెరిగి పీపా ధర 93 డాలర్ల వరకు చేరింది. గత ఏడేళ్లలో ఇంత భారీగా రేట్లు ఉండటం ఇదేతొలిసారి. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. డౌ ఫ్యూచర్స్ దాదాపు 500 పాయింట్లు నష్టపోయింది. బంగారం ధరలూ తొమ్మిది నెలల హైకి పెరిగాయి. పది గ్రాముల ధర 0.8 శాతం పెరిగి రూ.50,487లకు చేరింది. డాలర్​తో రూపాయి మారకం విలువ పడిపోయింది. హాంకాంగ్ షేర్లు ఐదు నెలల్లో అత్యంత కనిష్టానికి చేరుకున్నాయి. జపాన్  నిక్కీ ఇండెక్స్​   2శాతం కంటే ఎక్కువ పడిపోయింది. హాలిడే కారణంగా అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. అయితే వాల్​స్ట్రీట్​ శుక్రవారం నష్టపోయింది. 

ఎలా లేచిందంటే..

ఉక్రెయిన్​లో తిరుగుబాటుదారుల అధీనంలోని ప్రాంతాలను గుర్తిస్తున్నా, ప్రస్తుతం అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేయబోమన్న రష్యా ప్రకటన కాస్త తెరిపినిచ్చింది. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్ల వరకు కోలుకొని 382.91 పాయింట్ల నష్టంతో 57,300.68 వద్ద ముగియగా, నిఫ్టీ 114.50 పాయింట్లు (0.67)శాతం నష్టపోయి 17,092.20 వద్ద ముగిసింది. నిఫ్టీలో టాటా స్టీల్, టిసిఎస్, బిపిసిఎల్, టాటా మోటార్స్  ఎస్‌‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ దారుణంగా దెబ్బతినగా, ఎం అండ్ ఎం,   ఐషర్ మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్,  ఒఎన్‌‌జిసి పెరిగాయి. ఐటి, మెటల్, ఆయిల్ & గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌‌ఎంసిజి, రియాల్టీ , పిఎస్‌‌యు, బ్యాంక్ సూచీలు 1–-2శాతం తగ్గడంతో అన్ని రంగాల ఇండెక్స్​ ఎరుపురంగులో కనిపించాయి.  టీసీఎస్ 2.94 శాతం తగ్గి  రూ. 3,610.00 వద్ద ముగిసింది. ఎల్&టీ, డాక్టర్ రెడ్డీస్, యూపీఎల్,  బజాజ్ ఫిన్‌‌సర్వ్ స్టాక్స్​లోనూ కరెక్షన్ కనిపించింది. ఓఎన్జీసీ లాభపడింది.  30-షేర్ల బీఎస్ఈ ప్లాట్‌‌ఫారమ్‌‌లో, డాక్టర్ రెడ్డీస్, ఎల్&టీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ,  బజాజ్ ఫిన్‌‌సర్వ్ షేర్లు 3.06 శాతం వరకు పడిపోయి అత్యధిక నష్టాలను చవిచూశాయి. క్రెస్ట్​ వెంచర్స్​, వైట్​ ఆర్గానిక్​ రిటైల్​ షేర్లు 52 వారాల హైకి చేరాయి. రూపాయి మారకం విలువ 74.77లకు తగ్గింది. సెన్సెక్స్ సోమవారం కూడా 149 పాయింట్లు (0.26 శాతం) పడిపోయి 57,684 వద్ద ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్లు (0.40 శాతం) నష్టపోయి 17,207 వద్ద క్లోజయింది.