భర్తను చెట్టుకు కట్టేసి.. నవ వధువుపై అత్యాచారం

భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ నవ వధువుపై ఏడెనిమిది మంది అత్యాచారానికి ఒడిగట్టారు. భర్తను చెట్టుకు కట్టేసి.. మద్యం మత్తులో అతని కళ్లదుటే ఆమెను చెడిచారు. ఈ అమానుష ఘటన అక్టోబర్ 21న మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, 19 నుండి 20 ఏళ్ల వయస్సు ఉన్న నవ వధువు తన భర్తతో కలిసి రేవా జిల్లాలోని గుర్హ్ ప్రాంతంలో గల ప్రసిద్ధ దేవాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిక్నిక్ స్పాట్‌కు వెళ్లింది. భార్యాభర్తలిద్దరూ ఫౌంటెన్ దగ్గరున్న అందాలను తిలకిస్తుండగా.. ఏడెనిమిదిగురు వ్యక్తులు వారిని చుట్టుముట్టారు. ఎక్కడినుండి వచ్చారు..? ఇక్కడ ఏం పని..? అంటూ వారిని ప్రశ్నిస్తూనే నవ వధువు భర్తపై చేయి చేసుకున్నారు. అనంతరం అతన్ని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. అందునా, నిందితులు ఆ మహిళ యొక్క ప్రైవేట్ వీడియోను చిత్రీకరించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోను బహిరంగంగా పెడతామని ఆ భార్యాభర్తలను బెదిరించారు.

ALSO READ | అయ్యో పాపం: కోతులు దాడి చేయడంతో కిందపడి మహిళ మృతి

ఎలాగోలా అక్కడినుండి బయటపడిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. అక్టోబర్ 22న పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ కేసులో ఇప్పటికే అధికారులు 100 మందికి పైగా అనుమానితులను విచారించారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిలో ఒకరి చేతిపైనా, ఛాతీపైనా పచ్చబొట్లు ఉన్నాయని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. 

అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ

బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. మహిళకు ఇటీవలే వివాహం జరిగిందని, బాధితురాలు, ఆమె భర్తకు 19 నుండి 20 ఏళ్ల వయస్సు ఉండొచ్చని అధికారులు వెల్లడించారు.

"ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. మేము 100 మందికి పైగా వ్యక్తులను, అనుమానితులను విచారించాం. గుర్తు తెలియని వ్యక్తులుగా కేసు నమోదు చేశాం. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) కింద సామూహిక అత్యాచారం, ఇతర నేరాలకు పాల్పడినట్లు పలు సెక్షన్లు పొందుపరిచాం.." అని సీనియర్  పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.