IND vs NZ 2nd Test: సుందర్ 7 వికెట్లు.. ముగిసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్

పూణే టెస్టులో భారత్ తడబడి పుంజుకుంది. తొలి రెండు సెషన్ లో వికెట్లు తీయడానికి కష్టపడ్డ మన బౌలర్లు మూడో సెషన్ లో విజృంభించారు. దీంతో భారీ స్కోర్ ఖాయమన్న న్యూజిలాండ్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. సుందర్,అశ్విన్ తమ స్పిన్ మాయాజాలంతో కివీస్ ను తిప్పేయడంతో తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులకు ఆలౌటైంది. 76 పరుగులు చేసిన కాన్వే టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో సుందర్ 7 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి. 

5 వికెట్ల నష్టానికి 201 పరుగులతో మూడో సెషన్ ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 58 పరుగులు మాత్రమే జోడించగలిగింది. సుందర్ ధాటికి ఒక్కరు కూడా క్రీజ్ లో నిలవలేకపోయారు. ఫిలిప్స్(9), సౌథీ(5), అజాజ్ పటేల్(4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 33 పరుగులు చేసి సాంట్నర్ కొద్దిగా పోరాడాడు. అంతకముందు తొలి సెషన్ లో కాన్వే, రెండు సెషన్ లో రచీన్ రవీంద్ర హాఫ్ సెంచరీలు చేసి న్యూజిలాండ్ ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. 

ALSO READ | IND vs NZ 2nd Test: నువ్ చాలా మంచోడివి కోహ్లీ.. Love You: యువ అభిమాని

ఈ మ్యాచ్ లో మూడేళ్ళ తర్వాత భారత జట్టులోకి వచ్చి 7 వికెట్లు తీసిన సుందర్ హైలెట్ గా నిలిచాడు. మరో వైపు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కెరీర్ లో 531 వికెట్లతో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ ను వెనక్కి నెట్టాడు. విల్ యంగ్ వికెట్ తీసుకోవడంతో అతను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అత్యధిక వికెట్లు (188) తీసుకున్న బౌలర్ గా నిలిచాడు.