IND vs NZ: కివీస్‌తో భారత్‌ మూడో టెస్ట్.. 24 ఏళ్ళ తర్వాత ప్రమాదంలో మరో రికార్డ్

భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం (నవంబర్ 1) నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్ కు షాక్ ఇచ్చి న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో టీమిండియాపై నెగ్గి 12 ఏళ్ళ తర్వాత భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ALSO READ : Champions Trophy Hockey 2024: ఆసియా దేశాల హాకీ సమరం.. భారత జట్టు ప్రకటన 

సిరీస్ లోని చివరిదైన మూడో టెస్ట్ లోనూ గెలిచి న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్స్ షిప్ లో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఈ మ్యాచ్ లో కివీస్ గెలిస్తే భారత సుదీర్ఘ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. సొంతగడ్డపై భారత్ చివరిసారిగా 2000 సంవత్సమలో సిరీస్ కోల్పోయింది. సౌతాఫ్రికాపై భారత్ 2000 సంవత్సరంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో 0-2 తేడాతో ఓడిపోయింది. ముంబైలో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్లు తేడాతో ఓడిన భారత్.. ఆ తర్వాత బెంగళూరు టెస్టులో ఇన్నింగ్స్ 71 పరుగుల తేడాతో ఓడిపోయింది.   

భారత్ గడ్డపై టీమిండియాను క్లీన్ స్వీప్ చేసిన చివరి జట్టు సౌతాఫ్రికా. 24 ఏళ్ళ తర్వాత కివీస్ కు వైట్ వాష్ చేసే అవకాశం వచ్చింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే.. చివరిసారిగా 1997లో శ్రీలంకపై భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. 12 ఏళ్ళ తర్వాత భారత గడ్డపై సిరీస్ గెలిచి మన జట్టు జైత్రయాత్రకు బ్రేక్ వేసిన న్యూజిలాండ్.. 24 ఏళ్ళ రికార్డ్ బ్రేక్ చేస్తే భారత్ కు ఘోర అవమానం తప్పదు. ఈ టెస్ట్ కూడా ఓడిపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశం సంక్లిష్టం అవుతాయి.