IND vs NZ 3rd Test: 5 వికెట్లతో జడేజా మాయాజాలం.. 235 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

ముంబై టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. న్యూజిలాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే కట్టడి చేశారు. జడేజాతో పాటు సుందర్ రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. 82 పరుగులు చేసిన మిచెల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. యంగ్ హాఫ్ (71) సెంచరీ చేసి రాణించాడు. భారత బౌలర్లలో జడేజా 5 వికెట్లు పడగొట్టాడు. సుందర్ నాలుగు వికెట్లు తీసుకోగా.. ఆకాష్ దీప్ కు ఒక వికెట్ దక్కింది.     

6 వికెట్ల నష్టానికి 192 పరుగులతో తొలి రోజు మూడో సెషన్ ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 43 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది.  రెండో సెషన్ లో మూడు వికెట్లు పడగొట్టి అదరగొట్టిన జడేజా.. మూడో సెషన్ లోనూ ఆ జోరు చూపించాడు. వెంట వెంటనే హెన్రీ, సోధీలను పెవిలియన్ కు పంపాడు. సోధీ 7 పరుగులు చేయగా.. హెన్రీ డకౌట్ అయ్యాడు. ఈ దశలో అజాజ్ పటేల్ తో కలిసి మిచెల్ కాస్త మెరుపులు మెరిపించాడు. 

సెంచరీ దిశగా దూసుకెళ్తున్న మిచెల్ ను సుందర్ ఔట్ చేశాడు. 82 పరుగులు చేసిన మిచెల్ స్లిప్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అజాజ్ పటేల్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సుందర్ కు ఈ వికెట్ దక్కింది. న్యూజిలాండ్ లో మిచెల్, యంగ్ మినహాయిస్తే మిగిలిన వారందరూ విఫలమయ్యారు.