- అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌కింగ్ సెగ్మెంట్‌లో కొత్త మోడల్స్
- ప్రకటించిన మహీంద్రా గ్రూప్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్
బిజినెస్ డెస్క్, వెలుగు: యువతలో క్లాసిక్ బైక్స్‌పై క్రేజ్ పెరుగుతోంది. బైక్స్ తయారీ కంపెనీలు వింటేజ్ బాట పడుతున్నాయి. 1980, 90 ల్లో ఒక ఊపు ఊపిన యెజ్డీ మోటర్ సైకిల్స్‌ను మళ్లీ తీసుకొస్తున్నామని క్లాసిక్ లెజెండ్స్ ప్రకటించింది. యెజ్డీలో లేటెస్ట్ మోడల్స్‌ను వచ్చే నెల 13 న లాంచ్ చేస్తామని మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే జావా, బీఎస్‌ఏ వంటి క్లాసిక్ బైక్‌లను లాంచ్ చేసింది. వింటేజ్ లుక్‌తో ఆకట్టుకునే ఈ బైక్‌లను, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మార్చి తీసుకొస్తున్నారు. మొత్తం మూడు మోడల్స్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌స్టెర్ సెగ్మెంట్‌లో వీటిని తీసుకురానుంది. ఈ బైక్ మోడల్స్ స్పెసిఫికేషన్స్, ధర వచ్చే నెల బయటపెడతాయి. టీవీసీ షూట్‌లో యెజ్డీ మోటార్స్ బైక్‌లను ఫోటోలు తీశారు. వీటిని చూస్తుంటే కంపెనీ యెజ్డీ అడ్వెంచర్, స్క్రాంబ్లర్, రోడ్‌కింగ్ పేరుతో బైక్స్‌ను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. ఈ మూడు సెగ్మెంట్‌లలో ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా, బెనెలీ వంటి కంపెనీలు బైక్స్‌ను తెచ్చాయి. యెజ్డీ మోటార్‌సైకిల్స్ వీటితో పోటీ పడనుంది. గత కొన్ని నెలల నుంచి ట్రయల్స్ కూడా నిర్వహించింది.
జావాలానే యెజ్డీ..
క్లాసిక్ మోటార్స్ ఇప్పటికే జావా బ్రాండ్ కింద కొన్ని బైక్స్‌ను లాంచ్ చేసింది. యెజ్డీ కూడా జావా మోడల్స్‌కు సిమిలర్‌గా ఉంటాయని అంచనా. జావా పెరక్ మోడల్‌లో 334 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను వాడారు. ఇదే కెపాసిటీ ఇంజిన్‌ను యెజ్డీ బైక్స్‌లో కూడా వాడారు. ఇంజిన్ కెపాసిటీకి సంబంధించి ఇంకా డిటైల్స్ బయటకు రాలేదు. కానీ, జావా పెరక్ పెర్ఫార్మెన్స్‌కు సిమిలర్‌గా ఉండొచ్చని అంచనా. పెరక్ 30 బీహెచ్‌పీ కెపాసిటీని, 32.74 న్యూటన్‌మీటర్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ బైక్‌లో 6 గేర్స్ ఉన్నాయి. తయారు చేసే కంపెనీ ఒకటే కాబట్టి ఈ రెండింటికి చెందిన ఒకే మోడల్స్‌లో ఒకేలాంటి పార్టులు వాడే వీలుంది. క్లాసిక్ మోటార్స్ ఇప్పటికే సిక్స్‌టీస్ బైక్స్ అయిన జావా, బీఎస్‌ఏలు తిరిగి తీసుకొచ్చింది. 1960 స్టార్టింగ్‌లో ఇరానీ ఫ్యామిలీ నుంచి జావా మోటర్‌సైకిల్స్ ఇండియా లైసెన్స్‌ను క్లాసిక్ లెజెండ్స్ కొనుగోలు చేసింది. 1973 లో జావా బ్రాండ్ కింద మొదటిసారిగా బైక్స్‌ను లాంచ్ చేసింది.
