నయా సాల్ ఈవెంట్లపై నజర్

  • తనిఖీల కోసం 40 స్పెషల్​ టీమ్స్ ఏర్పాటు
  • నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు
  • ఎక్సైజ్‌, ఎన్​ఫోర్స్​మెంట్, ప్రొహిబిషన్‌ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ/వికారాబాద్ , వెలుగు: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్​పై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎక్సైజ్‌, ఎన్​ఫోర్స్​మెంట్, ప్రొహిబిషన్‌ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, డ్రగ్స్​వినియోగాన్ని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 స్పెషల్​టీమ్స్​ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, డ్రగ్స్​తో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

కోకైన్‌, ఎండీఎంఎ, ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్‌, గంజాయి, హాష్ ఆయిల్‌, డైజోఫామ్, హైడ్రో క్లోరిక్‌ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తే కేసులు బుక్​చేస్తున్నామని తెలిపారు. అనుమానితులకు డ్రగ్‌ డిటెక్షన్‌ కిట్‌ బాక్స్‌తో  పరీక్షలు నిర్వహిస్తున్నామని, న్యూఇయర్​వేడుకల్లో తనిఖీలు నిర్వహించే ప్రత్యేక టీమ్‌లకు కిట్స్‌ను అందజేస్తున్నామని వెల్లడించారు. బెంగూళూరు, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు, బస్సులు, ఇతర వెహికల్స్​పై నిఘా పెట్టామని గంజాయి అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్న నానక్‌రాం గూడ, ధూల్‌పేటతోపాటు అనుమానిత ప్రదేశాల్లో రోజూ తనిఖీలు చేస్తున్నామని శనివారం కమలాసన్​రెడ్డి చెప్పారు. 

గోవా రైలులో 95 లిక్కర్​ బాటిళ్లు సీజ్

న్యూఇయర్​వేడుకల కోసం అక్రమంగా తరలిస్తున్న 95 గోవా లిక్కర్​బాటిళ్లను వికారాబాద్​ ఎక్సైజ్​పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గోవా నుంచి హైదరాబాద్​వస్తున్న వాస్కోడిగామా ఎక్స్​ప్రెస్​లో సోదాలు చేసినట్లు ఎక్సైజ్​సూపరిండెంట్​విజయ్​భాస్కర్​ తెలిపారు. సోదాల్లో రూ.లక్ష విలువ చేసే 95 లిక్కర్​బాటిళ్లు దొరికాయని చెప్పారు. కొందరు యువకులు న్యూ ఇయర్ పార్టీ కోసం అక్రమంగా హైదరాబాద్​తరలిస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్​ఎక్సైజ్​ పోలీసులను ఎన్​ఫోర్స్​మెంట్​డైరెక్టర్​ కమలాసన్​రెడ్డి, డిప్యూటీ కమిషనర్​దశరథ్​అభినందించారు. దాడుల్లో ఎస్సైలు ప్రేమ్​రెడ్డి, వీరాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.