యాదగిరి గుట్టలో న్యూ ఇయర్  సందడి

  • ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు
  • ఉదయం 7.15 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకునాన్‌‌స్టాప్‌‌ దర్శనాలు
  • ధర్మదర్శనానికి నాలుగు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం

యాదగిరిగుట్ట, వెలుగు :యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ‘న్యూ ఇయర్‌‌’ సందడి కనిపించింది. కొత్త సంవత్సరం మొదటి రోజు కావడంతో హైదరాబాద్‌‌ సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పంచనారసింహుడు, శివకేశవులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు, కొండపైన బస్‌‌ బే, ప్రధానాలయ ప్రాంగణం, దర్శన, లడ్డూప్రసాద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.

భక్తుల రాకను ముందే ఊహించిన ఆలయ ఆఫీసర్లు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 7.15 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాన్‌‌స్టాప్‌‌గా దర్శనాలు కొనసాగించారు. మధ్యమధ్యలో బ్రేక్‌‌ దర్శనాలు, స్వామి వారికి నివేదన, ఆరగింపు కైంకర్యాలు చేపట్టారు. రద్దీకి సరిపడా లడ్డూ, పులిహోర ప్రసాదాన్ని అందుబాటులో ఉంచిన ఆఫీసర్లు.. ఉదయం ఐదు గంటలకే ప్రసాద కౌంటర్లను ఓపెన్‌‌ చేశారు.

రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాదగిరిగుట్ట ట్రాఫిక్‌‌ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు, 50 మంది ఎస్పీఎఫ్‌‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

నర్సన్నకు రికార్డు స్థాయి ఆమ్దానీ

యాదగిరిగుట్ట : న్యూ ఇయర్ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామికి రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. బుధవారం ఒక్కరోజే వివిధ పూజల ద్వారా రూ.83,26,642 ఆదాయం వచ్చింది. 2024 జనవరి ఒకటిన రూ.76,78,268 ఇన్‌‌కం రాగా.. ఈ సారి రూ.6,48,374 ఎక్కువగా వచ్చాయి. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.30,06,030, ప్రధాన బుకింగ్‌‌తో రూ.2,77,500, వీఐపీ దర్శనాల ద్వారా రూ.17.40 లక్షలు, బ్రేక్‌‌ దర్శనాలతో రూ.8,00,700, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.9 లక్షలు, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.2,17,600, యాదరుషి నిలయం ద్వారా రూ.1,38,802 ఆదాయం సమకూరింది. 

నారసింహుడి దర్శించుకున్న వీఐపీలు

న్యూ ఇయర్‌‌ను పురస్కరించుకొని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి బుధవారం పలువురు ప్రముఖులు ఆలయానికి క్యూ కట్టారు. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌‌ సీఎస్‌‌ వికాస్‌‌ రాజ్‌‌, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌‌కుమార్‌‌, హైకోర్టు జడ్జి జస్టిస్‌‌ రాధారాణి, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌రావు, ఐఏఎస్ ఆఫీసర్‌‌ గౌతమ్‌‌ వేర్వేరుగా ఫ్యామిలీలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ఈవో భాస్కర్‌‌రావు లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.