నేవీలోకి మహేంద్రగిరి.. అధునాతన యుద్ధనౌక ప్రారంభం

నేవీలోకి మహేంద్రగిరి.. అధునాతన యుద్ధనౌక ప్రారంభం
  • మన నేవీకి సత్తా మరింత పెరిగింది: ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్  

ముంబై: మన దేశ నౌకాదళంలోకి మరో యుద్ధ నౌక వచ్చి చేరింది. మజాగాన్ డాక్ షిప్‌‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) అభివృద్ధి చేసిన 'మహేంద్రగిరి' యుద్ధనౌకను ఉపరాష్ట్రపతి జగదీప్‌‌ ధన్‌‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ శుక్రవారం ప్రారంభించారు. ముంబైలోని వైబ్రెంట్ సిటీలో ఉన్న సముద్ర తీరంలో  కొత్త యుద్ధనౌకను  జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జగదీప్‌‌ ధన్‌‌ఖడ్ మాట్లాడుతూ.. ఇండియన్ నేవీ అభివృద్ధిలో మన దేశం సాధించిన పురోగతికి 'మహేంద్రగిరి' నిదర్శనమని అన్నారు. 

ఈ యుద్ధనౌకను ఎండీఎల్ సంస్థ 75 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిందని వెల్లడించారు. దీనికి తూర్పు కనుమల్లో భాగమైన ఒడిశాలోని 'మహేంద్రగిరి' పర్వతం పేరును పెట్టినట్లు తెలిపారు. ఇది ప్రాజెక్ట్ 17ఏ ఫ్రిగేట్స్ సిరీస్‌‌లో ఏడవదని.. మెరుగైన స్టెల్త్ ఫీచర్లు, అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్‌‌ఫారమ్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్‌‌లను కలిగి ఉందని వివరించారు.  ప్రాజెక్ట్17 ఏ కింద నిర్మించిన నీలగిరి -క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్‌‌లలోని 7 యుద్ధనౌకల్లో మహేంద్రగిరి చివరిదని తెలిపారు.

ప్రత్యేకతలు ఇవే.. 

'మహేంద్రగిరి' సుమారు 6,670 టన్నుల బరువు కలిగి ఉంటుంది.149.03 మీటర్ల పొడవు,17.8 మీటర్ల వెడల్పు ఉన్న ఈ నౌకలో  రెండు గ్యాస్ టర్బైన్‌‌లు ఉన్నాయి. అంతేగాక, రెండు ప్రధాన డీజిల్ ఇంజిన్‌‌ల కలయికతో 28 నాట్‌‌ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేశారు. దీని నిర్మాణంలో దేశీయ ఉక్కు, కార్బన్ మైక్రో అల్లాయ్ గ్రేడ్ స్టీల్‌‌ను ఉపయోగించారు. షిప్‌‌లో సూపర్‌‌సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణి వ్యవస్థను అమర్చారు. శత్రు విమానాలను, యాంటీ-షిప్ క్రూయిజ్ క్షిపణుల ముప్పును ఎదుర్కొనేలా ప్రత్యేక నిర్మాణాలు చేశారు. నిలువుగా మాత్రమే కాకుండా, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించేలాగా ఈ యుద్ధ నౌకలో క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేశారు.  

త్వరలో మరో స్వదేశీ విమాన వాహక నౌక 

నావికాదళానికి మరో స్వదేశీ ఎయిర్‌‌క్రాఫ్ట్ క్యారియర్ (ఐఎసీ) కోసం ఆర్డర్‌‌ను రిపీట్ చేయనున్నట్లు నేవీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ శుక్రవారం తెలిపారు. స్వదేశీయంగా నిర్మించిన 'ఐఎన్‌‌ఎస్‌‌ విక్రాంత్‌‌'తో కొచ్చిన్‌‌ షిప్‌‌యార్డ్‌‌ ఐఏసీల తయారీలో నైపుణ్యాన్ని సంపాదించుకుందని చెప్పారు. మరో ఎయిర్‌‌క్రాఫ్ట్ క్యారియర్ కోసం రీ-ఆర్డర్‌‌కు అన్ని సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం రెండు విమాన వాహక నౌకలున్నాయి. 'ఐఎన్ఎస్ విక్రమాదిత్య','ఐఎన్ఎస్ విక్రాంత్'. చివరిసారిగా స్వదేశీ విమాన వాహక నౌకను గత ఏడాది సెప్టెంబర్‌‌లో దేశ నౌకాదళంలోకి చేర్చారు.