జనవరి మొదటి వారంలో పీసీసీ కొత్త కార్యవర్గం .. జాబితా ఫైనల్ చేసిన రేవంత్, దీపాదాస్ మున్షీ

  • హైకమాండ్ ఆమోదముద్ర కోసం వెయిటింగ్
  • గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటించనున్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ కొత్త కార్యవర్గ ఏర్పాటుపై కసరత్తు పూర్తయింది. ఎంత మందికి చోటు కల్పిస్తారు? ఎవరికి ఏ పదవులు ఇస్తారనే దానికి సంబంధించిన జాబితా కూడా రెడీ అయింది. ఈ జాబితాపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీతో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చర్చించారు. వారిద్దరి సూచనల మేరకు కొన్ని మార్పులు చేసి జాబితాను ఫైనల్ చేశారు. ఇక హైకమాండ్ ఆమోద ముద్ర వేయడమే తరువాయి. 

ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కార్యవర్గాన్ని ప్రకటించేందుకు పీసీసీ చీఫ్ సిద్ధంగా ఉన్నారు. జనవరి మొదటి వారంలోనే కొత్త కార్యవర్గాన్ని అనౌన్స్ చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ బుధవారం ‘వెలుగు’కు చెప్పారు. అయితే, ఈ కార్యవర్గం మాత్రం పరిమితంగానే ఉంటదని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇంతకుముందు కూడా మహేశ్ గౌడ్ పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నందున ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు జంబో కార్యవర్గాన్ని ప్రకటించాల్సి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉండటంతో పరిమిత సంఖ్యలోనే కార్యవర్గం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని.. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సుల ఆధారంగా జాబితా సిద్ధం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసినోళ్లకు ఈ కార్యవర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. అయితే, హైకమాండ్ చేసిన సూచనతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేసినట్లు ప్రచారం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్​గా ఉన్నప్పుడు సుమారు ‌‌‌‌‌‌‌‌100 మందితో కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఇప్పుడు సగానికి తగ్గించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.