పౌర సేవలు స్పీడప్

  • కొత్త మున్సిపాలిటీలకు పోస్టుల మంజూరు
  • తప్పనున్న ఇన్​చార్జీల పాలన
  • ఉమ్మడి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలకు పోస్టులు

కోల్​బెల్ట్, వెలుగు: పాలనా సౌలభ్యం.. మెరుగైన పరిపాలన కోసం ఏర్పాటైన కొత్త మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయి ఆఫీసర్ల భర్తీ లేకపోవడంతో ఇన్​చార్జీలతో నెట్టుకొస్తున్నారు. కీలక విభాగంలో ఇన్​చార్జీలతో పాలనే కొనసాగుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యలు పరిష్కారం కాకపోవడం, సేవల్లోనూ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

కొత్త మున్సిపాలిటీల్లోని కిందిస్థాయి ఆఫీసర్లకు ఒక్కొక్కరికి రెండేసీ బాధ్యతలు అప్పగించడంతో సొంత శాఖకు, అటు ఇన్​చార్జీగా పూర్తిస్థాయి పర్యవేక్షణ లేక పట్టుతప్పుతోంది. సానిటేషన్, వాటర్​సప్లై, పర్మిషన్లు, సర్టిఫికెట్ల జారీ, రెవెన్యూ, హెల్త్​సహా అనేకాంశాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్​ సర్కార్​ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు 316 పోస్టులు మంజూరు చేసింది. అందులో ఆదిలాబాద్​ఉమ్మడి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు కొత్తగా 21 పోస్టులు మంజూరయ్యాయి. 

బీఆర్ఎస్​ పాలనలో భర్తీ కాని పోస్టులు

2018లో బీఆర్​ఎస్​ సర్కార్ ​కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. వీటికి 2019లో పాలకవర్గం ఎన్నికలు నిర్వహించింది. పాలనా సౌలభ్యం, మెరుగైన పరిపాలనే లక్ష్యంగా కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన బీఆర్​ఎస్​ సర్కార్.. పోస్టుల భర్తీని మాత్రం పట్టించుకోలేదు. ఉన్న ఆఫీసర్లకు  ఇన్​చార్జీలుగా రెండు మూడు బాధ్యతలు అప్పగించడంతో డ్యూటీలు చేయలేక సతమతమవుతున్నారు. పూర్తిస్థాయి ఆఫీసర్లు లేకపోవడంతో కొత్త బల్దియాల్లో ఆరేండ్లుగా కీలకమైన సానిటేషన్, రెవెన్యూ, హెల్త్​తదితర విభాగాల్లో పనులు అరకొరగా సాగుతున్నాయి. 

మున్సిపాలిటీల్లో కొత్త కాలనీలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్నాయి. పట్టణ శివారులో వందలాది ఎకరాల వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారి కొత్త భవనాల సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో మెరుగైన సేవలు అందించడం సమస్యగా మారింది. చిన్నచిన్న పనులకు కూడా పట్టణ ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. మరోవైపు వివిధ విభాగాలకు ఇన్​చార్జీగా ఉన్న ఆఫీసర్లకు సంబంధిత విభాగంపై అవగాహన, పట్టు లేకపోవడంతో  పౌర సేవల్లోనూ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.  

21 పోస్టులు మంజూరు

మున్సిపాలిటీల్లో పౌర సేవలకు అడ్డంకిగా మారిన ఇన్​చార్జీల పాలనను దూరం చేసేందుకు ఇటీవల రాష్ట్ర సర్కార్ ​కొత్తగా ఏర్పడిన బల్దియాలకు నూతన పోస్టులు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 316 పోస్టులు మంజూరు చేయగా.. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు కొత్త మున్సిపాలిటీలకు 21 పోస్టులు మంజూరయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టి​పేట మున్సిపాలిటీలకు మూడేసి చొప్పున పోస్టులు మంజూరు కాగా.. అందులో అసిస్టెంట్​కమిషనర్, శానిటరీ ఇన్​స్పెక్టర్, హెల్త్​అసిస్టెంట్ పోస్టులున్నాయి.

నస్పూర్​ మున్సిపాలిటీకి అసిస్టెంట్​కమిషనర్, శానిటరీ సూపర్​వైజర్, శానిటరీ ఇన్​స్పెక్టర్​, రెండు హెల్త్​ అసిస్టెంట్​ పోస్టులు, నిర్మల్​జిల్లాలోని ఖానాపూర్​ మున్సిపాలిటీకి అసిస్టెంట్​కమిషనర్, శానిటరీ ఇన్​స్పెక్టర్, హెల్త్​ అసిస్టెంట్, కుమ్రం భీం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన ఆసిఫాబాద్​మున్సిపాలిటీకి ఒక అసిస్టెంట్​ కమిషనర్, మేనేజర్, శానిటరీ ఇన్​స్పెక్టర్, హెల్త్​ అసిస్టెంట్​ పోస్టులు మంజూరయ్యాయి. ప్రభుత్వం త్వరలో ఆయా పోస్టులకు ఉద్యోగులను కేటాయించనుంది.   

సేవలు మెరుగవుతాయి

రాష్ట్ర సర్కార్​ కొత్త మున్సిపాలిటీలకు కొత్త పోస్టులు మంజూరు చేయడంతో పౌర సేవలు మరింత వేగవంతమవుతాయి. కీలకమైన శానిటేషన్, రెవెన్యూ, హెల్త్​విభాగాల్లో ఇన్​చార్జీల సమస్య లేకుండా పూర్తిస్థాయి ఆఫీసర్లతో సేవలు మరింత అందుతాయి. -గద్దె రాజు, క్యాతనపల్లి మున్సిపల్​ కమిషనర్​