డాక్టర్ జానకి.. హత్య కేసు!
టైటిల్ : అదృశ్యం
డైరెక్షన్ : సుధీష్ రామచంద్రన్
కాస్ట్ : అపర్ణ బాలమురళి, హరీష్ ఉత్తమన్, కళాభవన్ షాజోన్, సిద్దిక్, చందునాథ్ జి నాయర్
ప్లాట్ ఫాం : ఈ టీవీ విన్
జానకి (అపర్ణ బాలమురళి), అశ్విన్ ( సిద్ధార్థ్ మీనన్) ప్రేమించుకుంటారు. వృత్తిరీత్యా జానకి డాక్టర్, అశ్విన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటారు. వీళ్లద్దిరికీ వివేక్ అనే కామన్ ఫ్రెండ్ ఉంటాడు. ఒకరోజు జానకి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. ‘‘నా ఫ్రెండ్ వివేక్ని చంపాను”అని చెప్తుంది. కానీ.. అక్కడ సీఐగా పనిచేస్తున్న కరుణన్ (కళాభవన్ షాజోన్) ఆమె మాటల్ని కొట్టిపారేస్తాడు. ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడవం వల్లే అలా మాట్లాడుతుంది అనుకుంటాడు. అందుకే ఆమెని ‘‘అడ్రెస్ ఇచ్చి వెళ్లు. మేం ఇన్వెస్టిగేట్ చేస్తాం” అని చెప్తాడు. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న మీడియా వాళ్లు పోలీస్ స్టేషన్‌కు వస్తారు.
జానకి పోలీసులతో చెప్పిన విషయమే మీడియాకు కూడా చెప్తుంది. కానీ.. సీఐ ఈ కేసుని పట్టించుకోవడం లేదంటుంది. ఇంతలోనే వారం క్రితం ఒక ఫామ్‌హౌస్ నుంచి వివేక్ అనే వ్యక్తి మిస్ అయినట్టు సీఐకి ఫోన్ వస్తుంది. విషయం అర్థమైన సీఐ వెంటనే జానకిని తీసుకుని శవం పూడ్చిన ప్లేస్ చూపెట్టమని తీసుకెళ్తాడు. వాళ్లతో మీడియా కూడా సంఘటన జరిగిన ప్లేస్‌కి వెళ్తుంది. ఆమె చూపెట్టిన స్థలంలో తవ్వితే అక్కడ రెండు శవాలు ఉంటాయి. ‘ఈ హత్య చేయడానికి మీకు ఇంకెవరైనా సాయం చేశారా?’ అని మీడియా వాళ్లు జానకిని అడుగుతారు.
అప్పుడామె చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ‘‘సీఐ ఈ హత్య చేశాడు. నేను శవం పూడ్చిపెట్టడానికి సాయం చేశాన’’ని చెప్తుంది. సీఐ కరుణన్కి అసలేం జరుగుతుందో అర్థంకాదు. కరుణన్ కేంద్రమంత్రి దినేశన్ (సిద్ధిక్)కి బాగా నమ్మకస్తుడు. అందుకే ఎస్పీ ఇళవరసన్ (హరీశ్ ఉత్తమన్) కూడా కరుణన్ని ఈ కేసు నుంచి బయటపడేయాలి అనుకుంటాడు. కానీ.. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఆ మర్డర్ ఎవరు చేశారు? జానకి చూపించిన ప్లేస్‌లో బయటపడిన శవాలు ఎవరివి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
వాస్తవానికి ఈ సినిమా 2022లో ‘ఉతరమ్’ పేరుతో మలయాళంలో రీలీజ్ అయ్యింది. ఇప్పుడు తెలుగు డబ్ వెర్షన్ రిలీజ్ అయ్యింది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అపర్ణ బాలమురళి యాక్టింగ్‌కు ఫిదా అవ్వాల్సిందే. మిగతా వాళ్లు కూడా బాగానే నటించారు. సినిమాలో వచ్చే ట్విస్ట్‌లు బాగున్నాయి.
ఆ హత్యల వెనక....
టైటిల్ : సైరెన్
డైరెక్షన్ : ఆంటోని భాగ్యరాజ్
కాస్ట్ : జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగిబాబు
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
అంబులెన్స్ డ్రైవర్ తిలక్ (జయం రవి), జెన్నిఫర్(అనుపమ పరమేశ్వరన్)ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడు. కానీ.. ఆమెని చంపిన కేసులో అతను జైలుకు వెళ్తాడు. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో తిలక్ కూతురిని అతని అక్క పెంచుతుంది. కానీ.. ఆమెని అందరూ ‘ఖైదీ కూతురు’ అని ఎగతాళి చేస్తుంటారు. అందుకే తన తండ్రి తిలక్ మీద కోపం పెంచుకుంటుంది. ఇదిలా ఉండగా.. తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండడంతో 14 రోజుల పెరోల్‌పై జైలు నుంచి బయటికి వస్తాడు తిలక్. కానీ.. అప్పుడు తన కూతురు అతన్ని చూడడానికి కూడా ఇష్టపడదు.
అయితే.. తిలక్ జైలు నుంచి బయటికి వచ్చిన సమయంలో ఊళ్లో హత్యలు జరుగుతాయి. అదే ఏరియాలో నందిని (కీర్తి సురేశ్) పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె అప్పటికే మంత్రి మాణిక్యం, అతని అనుచరుడు దామోదర్ వల్ల ఒకసారి సస్పెండ్ అవుతుంది. అది జరిగిన కొన్నాళ్లకు వాళ్లిద్దరూ అనుమానాస్పదంగా చనిపోతారు. ఆ కేసుపై నందిని విచారణ చేస్తుంటుంది. మాణిక్యం మర్డర్ జరిగిన ప్రదేశంలో నందిని వాచీ దొరుకుతుంది. దాంతో ఈ హత్యలో ఆమె హస్తం ఉండొచ్చని డీఎస్పీ నాగలింగం (సముద్రఖని) అనుమానిస్తాడు.
అందుకే ఆమె ఈ కేసును వీలైనంత తొందరగా క్లోజ్ చేయాలి అనుకుంటుంది. అదే టైంలో చిల్లర దొంగతనాలు చేసే విక్కీ కనిపించకుండా పోవడంతో అతని తల్లి నందినికి కంప్లైంట్ చేస్తుంది. విక్కీ కనిపించకుండా పోవడానికి ముందు తిలక్ వర్మతో గొడవపడ్డాడనే విషయం విచారణలో తెలుస్తుంది. తిలక్ బయటికి వచ్చిన తరువాతే రెండు హత్యలు, ఒక కిడ్నాప్ జరగడంతో వాటన్నింటికీ అతడే కారణమని అదుపులోకి తీసుకుంటుంది. కానీ.. సరైన ఆధారాలు దొరక్క విడిచిపెడుతుంది. మరి ఆ హత్యలు ఎవరుచేశారు. విచారణలో నందినికి తెలిసిన నిజాలు ఏంటి? జెన్నిఫర్‌ను చంపింది ఎవరు? నాగలింగంపై తిలక్ పగకు కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పగ తీర్చుకోవడం అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ.. ఇందులో హీరో జైలులో ఉండి మరీ కుటుంబాన్ని కాపాడుకోవడం, పగ తీర్చుకుంటాడు. ప్లాట్ కొత్తగా లేకపోయినా... ట్విస్ట్‌లు, ప్రజెంట్ చేసిన విధానం బాగున్నాయి.