OTT MOVIES.. అనుకున్నదొకటి.. అయ్యిందొకటి...

టైటిల్​ : నాగేంద్రన్స్ హనీమూన్
కాస్ట్ : సూరజ్ వెంజరమూడు, గ్రేస్ ఆంటోనీ, శ్వేత మెనన్, కని కుస్రుతి, అల్ఫీ పంజికరన్, అమ్ము అభిరామి, అలెగ్జాండర్ ప్రశాంత్​
డైరెక్షన్ : నితిన్ రెంజీ పానికర్
ప్లాట్​ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
లాంగ్వేజ్ : మలయాళం, తెలుగు

1980ల నాటి కథ ఇది. ఓ మారుమూల గ్రామానికి చెందిన నాగేంద్రన్. తల్లితో కలిసి ఉంటుంటాడు. నాగేంద్రన్ ఎంత బద్ధకస్తుడంటే.. ‘‘పెళ్లి చేసుకుంటే భార్యను పోషించాలి. భార్యను పోషించాలంటే ఏదైనా పని చేయాలి. అంటే కష్టపడాలి. కాబట్టి జీవితంలో అసలు పెళ్లే చేసుకోకూడదు’’ అనుకుంటాడు. అందుకే 40 ఏళ్లు దాటినా పెళ్లి గురించి ఆలోచించడు. అలాంటిది కట్నం కోసం నాగేంద్రన్ ఏకంగా ఐదు పెండ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది. అందుకు కారణం నాగేంద్రన్ స్నేహితుడు పౌలోస్ (రమేశ్). అతను చాలాకాలం తర్వాత కువైట్ నుంచి ఇంటికి వస్తాడు. 

ఆ ఊళ్లో అతనికున్న క్రేజ్ చూసి తాను కూడా కువైట్ వెళ్లాలనుకుంటాడు నాగేంద్రన్. అక్కడైతే తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చనేది అతని ఆలోచన. కానీ, కువైట్​కి వెళ్లాలంటే డబ్బు కావాలి. కాబట్టి కొంత డబ్బు సమకూర్చుకుంటే, తాను కువైట్​కి పంపిస్తానని పౌలోస్ నాగేంద్రన్​కు మాట ఇస్తాడు. ఆ క్రమంలోనే నాగేంద్రన్​ ఐదు పెండ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది. ఆ జర్నీ అంతా కామెడీగా ఉంటుంది. ఇంతకీ నాగేంద్రన్​ కువైట్ వెళ్లాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ సిరీస్​ చూడాల్సిందే. ఈ కథను దర్శకుడు నితిన్ రెంజి పనికర్ ఎంటర్​టైనింగ్​గా, ఇంట్రెస్టింగ్​గా తెరకెక్కించాడనే చెప్పొచ్చు.  

.. అంకుల్ నవ్విస్తాడు

టైటిల్​ : బూమర్ అంకుల్
కాస్ట్ : యోగి బాబు, ఒవియా, యుహాని శ్రీ, రోబో శంకర్, ఎం.ఎస్ భాస్కర్ 
డైరెక్షన్ :  స్వదేశ్ ఎం.ఎస్
ప్లాట్​ఫాం : ఆహా
లాంగ్వేజ్ : తమిళం, తెలుగు

బూమర్ అంకుల్ సినిమాలో యోగిబాబు, ఒలివా ప్రధాన పాత్రల్లో చేశారు. సినిమా కథ విషయానికి వస్తే.. బూమర్ అంకుల్ మూవీలో నేసమ్‌‌ (యోగిబాబు)- అమీ (ఓవియా) దంపతులు. విదేశీ యువతి అమీతో నేసమ్‌‌కు పరిచయం ఏర్పడుతుంది. వాళ్లిద్దరికీ పెండ్లి అవుతుంది. అయితే నేసమ్ భార్యకు విడాకులు ఇవ్వాలి అనుకుంటాడు. అందుకు కారణాలేంటి?  అలాగే భర్తపై భార్య ఎలా పగతీర్చుకోవాలనుకుంది? అనే అంశాలను కామెడీ జానర్​లో తెరకెక్కించారు. ఆద్యంతం నవ్వులు పంచే సినిమా ఇది. క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా, కమెడియన్​గా కనిపించే యోగిబాబు..  కథానాయకుడిగా కూడా మెప్పించాడు. 

నిజాయితీపరుడే తప్పు దారి ఎంచుకుంటే..

టైటిల్​ : త్రిభువన్ మిశ్రా సి.ఎ. టాపర్
కాస్ట్ : మానవ్ కౌల్, తిలోత్తమా షోమ్, సుభ్రజ్యోతి, శ్వేతా బసు ప్రసాద్, నైనా సరీన్, సుమిత్ గులాటి, ఫైసల్ మాలిక్, శ్రీకాంత్ వర్మ, జితిన్ గులాటి, యామిని దాస్, అశోక్ పాఠక్
డైరెక్షన్ :  అమృత్ రాజ్ గుప్తా, పునీత్ కృష్ణ
ప్లాట్​ఫాం : నెట్‌‌ఫ్లిక్స్
లాంగ్వేజ్ : హిందీ

ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే సాధారణ వ్యక్తి త్రిభువన్ మిశ్రా ( మానవ్ కౌల్). మిశ్రా తన భార్య అశోక్లత (నైనా సరీన్), -ఇద్దరు పిల్లలతో ఉత్తరప్రదేశ్‌‌లోని నోయిడాలోని ఒక ఇంట్లో ఉంటాడు. మిశ్రా లంచాలకు వ్యతిరేకం. తన నిజాయితీ చూసి గర్వపడుతుంటాడు. మిశ్రా జీతం కోసమే పనిచేసే మనిషి. అలాంటిది అతని జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది.  అతను పొదుపు చేసిన మొత్తాన్ని బ్యాంక్​లో వేసుకుంటాడు. అయితే అతనికి సంబంధించిన అన్ని బ్యాంకు ఖాతాలను ఆర్​బీఐ ఫ్రీజ్​ చేస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా అని ఆలోచిస్తుంటే.. 

ఒకరోజు ఒక ఆలోచన వస్తుంది. దాంతో అతను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంపాదిస్తాడు. అతనికి ఉన్న క్లయింట్స్​లో బాగా నమ్మకస్తుడైన బిందీ (తిలోత్తమా షోమ్) కాంట్రాక్ట్ కిడ్నాపర్‌‌ భార్య. దీంతో ఆమె భర్త మిశ్రాను అంతం చేయాలనుకుంటాడు. మరి మిశ్రా ఆ కాంట్రాక్టర్ నుంచి తనని, తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు? అసలు మిశ్రాను ఎందుకు కాంట్రాక్టర్ చంపాలనుకుంటాడు? ఫైనల్​గా ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ. ఈ సిరీస్​కి ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఇది ఫ్యామిలీతో కలసి చూడకపోవడం బెటర్.

ఆ ఎన్నికల్లో గెలుపెవరిది?

టైటిల్​ : ఎలక్షన్
కాస్ట్ : విజయ్ కుమార్, ప్రీతి అస్రాని, రిచా జోషి, జార్జ్​ మార్యన్, దిలీపన్​
డైరెక్షన్ :  తమిళ
ప్లాట్​ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
లాంగ్వేజ్ : మలయాళం, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ

నల్లూరు అనే ఒక చిన్న ఊళ్లో నల్ల శివమ్ ( జార్జ్ మరియన్), తణికాచలం ఇద్దరూ ఒకే పార్టీలో చాలాకాలంగా పనిచేస్తుంటారు. నల్ల శివమ్ కొడుకు నటరాజన్ ( విజయ్ కుమార్), తణికాచలం కూతురు సెల్వి (రిచా జోషి) ప్రేమించుకుంటారు. వాళ్ల పెండ్లికి పెద్దలు ఒప్పుకుంటారు. అయితే ఆ తరువాత కొన్ని రాజకీయపరమైన కారణాల వల్ల ఆ రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు వస్తాయి. దాంతో తణికాచలం కావాలనే తన కూతురు సెల్వికి వేరే యువకుడితో పెళ్లి చేస్తాడు. ఆ తరువాత కొంతకాలానికి నటరాజన్, హేమ (ప్రీతి అస్రాని)ను పెండ్లి చేసుకుంటాడు. 

కట్ చేస్తే.. ఐదేళ్ల తరువాత ఎలక్షన్స్ వస్తాయి. ఈసారి పంచాయితీ ఎన్నికల్లో హేమను నిలబెట్టమని నటరాజన్ తో చెప్తాడు సుధాకర్ అనే అతను. అందుకు తన సపోర్టు ఉంటుందని చెప్తాడు. కానీ, అదే సుధాకర్ తన భార్యతో కూడా నామినేషన్ వేయిస్తాడు. దాంతో ఈ విషయంపై వాళ్లు సుధాకర్​ను నిలదీస్తారు. అప్పుడు సుధాకర్ ఏం చెప్పాడు? భాయ్​ని చంపించింది ఎవరు? నటరాజన్​ ఎన్నికల్లో గెలుస్తాడా? అనేది మిగతా కథ. రాజకీయ పరమైన అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కథ. 

పుష్ప రాకతో.. మలుపు తిరిగిన కథ

టైటిల్​ : బహిష్కరణ 
కాస్ట్ : అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, మహబూబ్ బాషా, షణ్ముక్​​
డైరెక్షన్ : ముఖేశ్ ప్రజాపతి
ప్లాట్​ఫాం : జీ 5
లాంగ్వేజ్ : తెలుగు

1990ల నాటి కథ ఇది. గుంటూరు జిల్లా ‘పెద్దపల్లి’ గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్) సర్పంచ్. అతని అనుచరులుగా దర్శి (శ్రీతేజ్), సూరి (షణ్ముఖ్) పనిచేస్తుంటారు. దర్శికి ‘లక్ష్మి’ (అనన్య నాగళ్ల) అనే మరదలు ఉంటుంది. చిట్టి (మహబూబ్ బాషా) దర్శి స్నేహితుడు. ఆ ఊళ్లో ఎవరూ ఊహించనటువంటి విషాదాలు జరుగుతున్న సమయంలో ఆ ఊరికి పుష్ప (అంజలి) వస్తుంది. ఆమె డబ్బున్న శివయ్యను వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. పుష్పను ఊరి చివర ఒక ఇంట్లో ఉంచుతాడు శివయ్య. అయితే, పుష్పకు ఏది అవసరమైనా పనులు చేసి పెడుతుంటాడు దర్శి. 

అలా కొన్నాళ్లకు వాళ్లిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. పుష్పను పెండ్లి చేసుకోవాలి అనుకుంటాడు దర్శి. ఆ విషయం తన యజమాని శివయ్యకు చెప్తాడు. మరి శివయ్య ఆ పెండ్లికి ఒప్పుకున్నాడా లేదా శివయ్య నిర్ణయంతో వాళ్ల జీవితాలు ఏ మలుపు తిరుగుతాయి? దర్శి మరదలు లక్ష్మి పరిస్థితి ఏమవుతుంది? ఈ కథలో పుష్ప పాత్ర ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. పుష్ప, దర్శి, శివయ్య పాత్రల్లో నటించిన అంజలి, శ్రీతేజ్, రవీంద్ర విజయ్​ల​ నటన బాగుంది. స్క్రీన్​ ప్లేతో ఆకట్టుకున్నాడు దర్శకుడు. కథ పాతదే అయినా తను అనుకున్నట్టే తీయడంలో సక్సెస్ అయ్యాడు. కాకపోతే ఫ్యామిలీతో కలిసి చూడడం కష్టమే. 

నాలుగు కథలు.. ఒక సందేశం

టైటిల్​ : హాట్ స్పాట్
కాస్ట్ : కలైయారసన్, ఆదిత్య భాస్కర్, గౌరీ జి. కిషన్, అమ్ము అభిరామి, జనని
డైరెక్షన్ :  విఘ్నేశ్ కార్తీక్
ప్లాట్​ఫాం : ఆహా
లాంగ్వేజ్ : తమిళం, తెలుగు

మహ్మద్ షఫీ (విఘ్నేశ్ కార్తీక్) డైరెక్టర్​ కావాలనే ఆశతో తను రాసిన కథలు పట్టుకుని అవకాశాల కోసం తిరుగుతుంటాడు. ఎన్నో కథలు విని విసిగిపోయిన ఓ నిర్మాత.. కథలు చెప్పేందుకు షఫీకి పది నిమిషాల టైం ఇస్తాడు. అప్పుడు షఫీ ఆయన్ని ఎలాగోలా ఒప్పించి నాలుగు కథలు చెప్తాడు. ఆ నాలుగు కథలు ఏంటి? అవి విన్న తరువాత ఆ నిర్మాత ఎలా స్పందిస్తాడు? దర్శకుడిగా షఫీకి ఛాన్స్ ఇస్తాడా? లేదా? అనేది కథ. 

ఆ నాలుగు కథలేంటంటే.. పెళ్లి తరువాత ఆడపిల్లలు మాత్రమే తమ ఇంటిని వదిలిపెట్టి ఎందుకు వెళ్లాలి? అనేది మొదటి కథ. ప్రేమ పెళ్లిలో ఇలా జరిగే అవకాశం కూడా ఉందా? అనిపించేది రెండో కథ. తప్పు చేసి సమర్థించుకునే లవర్​ను ప్రశ్నించే ప్రియురాలి కథ మూడోది. ఇక నాలుగోది.. టీవీ షోలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? అని. ఈ  నాలుగు కథల్లో చివరిది చిన్నపిల్లలున్న తల్లిదండ్రులు చూడాల్సిన కథ. సినిమాటోగ్రఫీ, బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ బాగున్నాయి. కానీ ఫ్యామిలీ అంతా కలిసి చూడడం కాస్త కష్టమే.