OTT లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే

మిస్సింగ్​

టైటిల్ : సెక్టార్​–36
ప్లాట్​ ఫాం : నెట్​ఫ్లిక్స్​
 డైరెక్షన్ : ఆదిత్య నింబాల్కర్​
కాస్ట్ : విక్రాంత్​ మాస్సే, దీపక్​ డోబ్రియల్​, దర్శన్​ జరీవాలా, అజీత్​ సింగ్, బహరుల్​ ఇస్లాం, ఇప్షితా చక్రవర్తి సింగ్

ఈ క్రైమ్​ థ్రిల్లర్​ని నిఠారీ సీరియల్​ కిల్లింగ్స్​ కేసు ఆధారంగా తీశారు. ఈ సంఘటన 2005లో నోయిడాలో జరిగింది. అప్పట్లో ఈ కేసు ఒక సంచలనం. ఢిల్లీలోని సెక్టార్ 36 ప్రాంతంలో కేర్‌‌‌‌టేకర్‌‌‌‌గా పనిచేసే ప్రేమ్ (విక్రాంత్ మాస్సే) ఒక అమ్మాయి శరీరాన్ని క్రూరంగా కోస్తున్న సీన్​తో సినిమా మొదలవుతుంది. ప్రేమ్ బయటికి ఒక ఫ్యామిలీ మ్యాన్​లా కనిపిస్తుంటాడు. బస్సీ అనే వృద్ధుడి దగ్గర కేర్​టేకర్​గా పనిచేస్తుంటాడు. 

ఢిల్లీలో ఎక్కువ జనాభా ఉండే మురికివాడ రాజీవ్ కాలనీ నుండి అనేక మంది పిల్లల్ని ముఖ్యంగా టీనేజ్​ అమ్మాయిలను కిడ్నాప్​ చేసి చంపేస్తుంటాడు. ఆ తర్వాత అవయవాలను అక్రమ రవాణా చేస్తుంటాడు. ఇదంతా చేసేది అతని యజమాని కోసమే.  అయితే.. ఆ తప్పిపోయిన పిల్లల జాడ కనిపెట్టేందుకు ఇన్‌‌‌‌స్పెక్టర్ రామ్ చరణ్ పాండే (దీపక్ డోబ్రియాల్) పనిచేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కిల్లర్ లక్ష్యం ఏంటి? ఎలా పట్టుబడ్డాడు? తెలియాలంటే ఈ సినిమా చూడాలి. 

ముగ్గురి లక్ష్యం ఒక్కటే

టైటిల్ : బెంచ్ లైఫ్ 
ప్లాట్​ ఫాం : సోనీలివ్  
డైరెక్షన్ : మానస శర్మ
కాస్ట్ : వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, రాజేంద్ర ప్రసాద్, నయన్ సారిక, వెంకటేష్ కాకుమాను, తులసి, తనికెళ్ల భరణి

హైదరాబాద్‌‌‌‌లోని ఆప్కో టెక్‌‌‌‌ అనే సాఫ్ట్​వేర్​ కంపెనీలో పనిచేస్తున్న బాలు (వైభవ్), మీనాక్షి (రితికా సింగ్), రవి (చరణ్ పేరి)ల చుట్టూ తిరిగే కథ ఇది. బాలు ప్రమోషన్స్​ లేకున్నా అదే కంపెనీలో తొమ్మిదేళ్లుగా ప‌‌‌‌నిచేస్తుంటాడు. అందుకు కారణం.. అతను ప్రేమించే అమ్మాయి ఇషా (ఆకాంక్ష సింగ్‌‌‌‌) ఆ కంపెనీలో పనిచేయడమే. ఇషాకు త‌‌‌‌న ప్రేమ‌‌‌‌ గురించి చెప్పేందుకు ఒక మంచి ఛాన్స్​ కోసం వెయిట్​ చేస్తుంటాడు. మీనాక్షికి జాబ్​ చేయాలనే ఇంట్రెస్ట్​ లేకున్నా ఇంట్లో ఒత్తిడి వల్ల ​ చేస్తుంటుంది.

ఆమెకు సినిమాల మీద ఉన్న ఇష్టంతో డైరెక్టర్​ అయ్యేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంటుంది. కానీ.. ఆడ‌‌‌‌వాళ్లు డైరెక్టర్​ కావ‌‌‌‌డం చాలా కష్టమని తన త‌‌‌‌ల్లితో పాటు అందరూ సినిమాల వైపు వెళ్లొద్దని చెప్తుంటారు. ఇక ర‌‌‌‌వి విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లైన యువకుడు. తన భార్య గాయత్రి (న‌‌‌‌య‌‌‌‌న్ సారిక‌‌‌‌)కి తెలియకుండా ఫ్రెండ్స్​తో కలిసి గోవా ట్రిప్ వెళ్లేందుకు ప్లాన్‌‌‌‌ చేస్తాడు. ఈ ముగ్గురు తమ లక్ష్యాలకు దగ్గర కావాలంటే.. బెంచ్​కు వెళ్లాలి. సాధారణంగా సాఫ్ట్‌‌‌‌వేర్ కంపెనీల్లో ప్రాజెక్ట్ వర్క్​ లేనివాళ్లను బెంచ్‌‌‌‌కు పంపిస్తారు. బెంచ్‌‌‌‌లో చేయాల్సిన ప‌‌‌‌ని ఏమీ ఉండదు. 

అయినా.. జీతం ఇస్తారు. కానీ.. అందులో ఉన్నవాళ్ల జాబ్ పోయే ప్రమాదం కూడా ఉంటుంది. బాలు బెంచ్​కి వెళ్లి అక్కడినుంచి ఇషా టీంలో జాయిన్​ కావాలి అనుకుంటాడు. మీనాక్షి ఖాళీ టైంలో సినిమా ప్రయత్నాలు చేయాలి అనుకుంటుంది. బెంచ్​లోకి వెళ్లగానే రవి గోవాకు వెళ్లాలి అనుకుంటాడు. వీళ్ల లక్ష్యాలు నెరవేరాయా? ఈ ముగ్గురి ఉద్యోగాలు ఉన్నాయా? ఊడిపోయాయా? ఐపీఎస్ ఉద్యోగానికి రిజైన్ చేసి సాఫ్ట్‌‌‌‌వేర్ ఆఫీస్‌‌‌‌లో జాయిన్ అయిన ప్రసాద్​ వ‌‌‌‌శిష్ట (రాజేంద్రప్రసాద్​) క‌‌‌‌థేంటి? తెలుసుకోవాలంటే ఈ వెబ్​సిరీస్​ చూడాలి. 

హిందీ పరీక్ష

టైటిల్ : రఘుతాత 
ప్లాట్​ ఫాం : జీ 5 
డైరెక్షన్ : సుమన్ కుమార్
కాస్ట్ : కీర్తి సురేశ్, ఎమ్ఎస్ భాస్కర్, దేవదర్శిని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాజీవ్ రవీంద్రనాథన్

క‌‌‌‌య‌‌‌‌ళ్​ విజీ పాండియ‌‌‌‌న్ (కీర్తి సురేష్‌‌‌‌) బ్యాంకు ఉద్యోగి. సొసైటీలో ఆడవాళ్లకు మగవాళ్లతో స‌‌‌‌మానంగా హ‌‌‌‌క్కులు ఉండాల‌‌‌‌ని కోరుకునే వ్యక్తి. పైగా మాతృభాష అభిమాని. అందుకే వాళ్ల ఊళ్లో ‘అందరూ హిందీ నేర్చుకోవాలి’ అంటూ ఒక ప్రభుత్వ అధికారి చేసే ప్రచారాన్ని వ్యతిరేకిస్తుంది. అతను పెట్టాలి అనుకున్న సభను అడ్డుకుంటుంది. అందుకు తన తాత ర‌‌‌‌ఘోత్తమ్​ (ఎమ్ఎస్ భాస్కర్​) కూడా సాయం చేస్తాడు. అలా మాతృభాష‌‌‌‌ను కాపాడినందుకు ఊళ్లోవాళ్లంతా ఆమెకు స‌‌‌‌న్మానం కూడా చేస్తారు. తర్వాత ఆమెకు బ్యాంక్​లో ప్రమోషన్​ వస్తుంది.

 కానీ.. అందుకోసం కచ్చితంగా హిందీ నేర్చుకోవాల‌‌‌‌ని కండీష‌‌‌‌న్ పెడ‌‌‌‌తారు. హిందీ మీద కోపంతో ప్రమోషన్​ కూడా కాదంటుంది. అప్పుడే తాత ర‌‌‌‌ఘుకు క్యాన్సర్​ అని తెలుస్తుంది. దాంతో అతని చివ‌‌‌‌రి కోరిక మేర‌‌‌‌కు త‌‌‌‌మిళ్ సెల్వన్ (ర‌‌‌‌వీంద్ర విజ‌‌‌‌య్‌‌‌‌)ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. పెళ్లి నిశ్చయం అయ్యాక ఆమెకు సెల్వన్​ గురించి ఒక నిజం తెలుస్తుంది. దాంతో ఆమెకు ఇష్టం లేకపోయినా ఎవరికీ తెలియకుండా హిందీ ఎగ్జామ్​ రాసి, అతనికి దూరంగా వెళ్లాలని డిసైడ్​ అవుతుంది. ఇంతకీ ఆమెకు తెలిసిన నిజం ఏంటి? ఆమె అంతలా ద్వేషించే హిందీని ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాలి.  

ల్యాప్​టాప్​లో ఏముంది? 

టైటిల్ : నునాకుజి
ప్లాట్​ ఫాం : జీ5 
డైరెక్షన్ : జీతూ జోసెఫ్
కాస్ట్ : బాసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోని, నిఖిలా విమల్, సిద్దిఖీ, బైజు సంతోష్, మనోజ్ కె.జయన్, సైజు కురుప్ 

ఇబీ జచారియా (బాసిల్ జోసెఫ్) పూజికున్నెల్​ కంపెనీకి మేనేజింగ్​ డైరెక్టర్​. కానీ.. అతను బాగా లేజీగా పనులు చేస్తుంటాడు. కొత్తగా పెళ్లి కావడంతో ఎప్పుడూ భార్య (నిఖిల విమల్) ధ్యాసలోనే ఉంటాడు. కంపెనీని పెద్దగా పట్టించుకోడు. పైగా తన భార్యను ఒప్పించి వాళ్ల ప్రైవేట్​ వీడియోని ల్యాప్​టాప్​లో స్టోర్​ చేసుకుంటాడు. అలాంటి టైంలో అనుకోకుండా ఓరోజు ఇబీ ఆఫీస్​లో ఐటీ రైడ్ జరుగుతుంది. 

అప్పుడు ఐటీ ఆఫీసర్ భామకృష్ణన్ (సిద్ధిఖీ) ఆ ల్యాప్​టాప్​ని కూడా సీజ్ చేస్తాడు. ఆ వీడియో ఉన్న ల్యాప్ టాప్ తిరిగి తీసుకురాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది ఇబీ భార్య. దాంతో ల్యాప్ టాప్ కోసం ఆఫీసర్​ ఉండే అపార్ట్​మెంట్​కి వెళ్తాడు ఇబీ. కానీ.. కొన్ని పరిస్థితుల వల్ల అదే అపార్ట్​మెంట్​లో ఉంటున్న రెష్మిత (గ్రేస్ ఆంటోని) ఫ్లాట్​లోకి వెళ్తాడు. దాంతో మరిన్ని చిక్కుల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ల్యాప్ టాప్ తిరిగి తీసుకున్నాడా? లేదా? అనేది సినిమా.

గూఢచారి

టైటిల్ : బెర్లిన్ 
ప్లాట్​ ఫాం : జీ5 
డైరెక్షన్ : అతుల్ సబర్వాల్
కాస్ట్ : అపర్శక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్, రాహుల్ బోస్, కబీర్ బేడి, అనుప్రియా గోయెంకా

అశోక్ (ఇష్వాక్ సింగ్) చెవిటి, మూగవాడు. పైగా అనాథ. అతను కన్నాట్​ అనే ప్లేస్​లో ఉన్న ఒక రెస్టారెంట్​లో పనిచేస్తుంటాడు. అయితే.. అతను ఒక గూఢచారి అని ప్రభుత్వ గూఢచార సంస్థలైన బ్యూరో, వింగ్ అనుమానిస్తాయి. అదే టైంలో 1993లో ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రష్యా ప్రెసిడెంట్ ఇండియాకు వస్తున్నట్టు ప్రకటిస్తారు. దాంతో.. ఇండియాకు వచ్చే అతిథులకు ఎలాంటి హానీ కలగకూడదు అనే ఉద్దేశంతో అశోక్​ నుంచి కొన్ని సీక్రెట్లను రాబట్టాలని నిర్ణయించుకుంటారు

 అధికారులు. అందుకోసం అశోక్ ఆలోచనలను తెలుసుకునేందుకు, అతని అస్పష్టమైన భాష అర్థం చేసుకోవడానికి అధికారి సోధీ (రాహుల్ బోస్) ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగానే మూగ, చెవిటి పిల్లలు చదువుకునే స్కూల్​లో టీచర్​గా పనిచేస్తున్న పుష్కిన్ వర్మ (అపర్శక్తి ఖురానా)ని తీసుకొస్తారు. అశోక్​ నుంచి పుష్కిన్ ఏం తెలుసుకున్నాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. 

నాలుగు కథలు

టైటిల్ : రూపాంతర ; ప్లాట్​ ఫాం : అమెజాన్ ప్రైమ్ 
డైరెక్షన్ : మిథిలేష్ ఎడవళత్
కాస్ట్ : రాజ్ బి శెట్టి, లేఖా నాయుడు, హనుమక్క, జైశంకర్ ఆర్యర్, సోమశేఖర్ బోలేగావ్, భరత్ జిబి, అంజన్

మొత్తం నాలుగు క‌‌‌‌థ‌‌‌‌ల‌‌‌‌తో వచ్చిన అంథాల‌‌‌‌జీ డ్రామా థ్రిల్లర్​ ఇది. ఉత్తర కర్ణాటకకు చెందిన వృద్ధ దంపతులు సిటీకి వలస వెళ్తారు. ఆ ఉరుకులుప‌‌‌‌రుగుల ప్రపంచంలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులను మొదటి కథలో చూపించారు. పోలీసు కానిస్టేబుల్ (భరత్ జిబి) ఒక అడుక్కునే మహిళ (లేఖా నాయుడు) దగ్గర ఎక్కువ డబ్బు ఉండడం చూసి అనుమానిస్తాడు. ఆ విషయాన్ని తన సీనియర్​కి చెప్తాడు. 

ఆమెని పిల్లల్ని దొంగతనం చేసే వ్యక్తి అని అనుకుంటాడు. దాంతో ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. అప్పుడు వాళ్లకు తెలిసిన నిజం ఏంటి? అనేదే రెండో స్టోరీ. మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి డ్రగ్స్​, ఆన్‌‌‌‌లైన్ గేమ్స్​కు అలవాటైన ఒక యువకుడు తన జీవితంలో ఏం కోల్పోయాడో చెప్పేదే మూడో స్టోరీ. ఒక గూండా (రాజ్ బి శెట్టి) యువ ఐటీ ఉద్యోగి (జైశంకర్ ఆర్యర్)తో అనవసరంగా గొడవ పడతాడు.  ఆ తర్వాత ఆశ్చర్యంగా వాళ్లిద్దరూ కలిసిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నాలుగో స్టోరీ.