నెలలో రెండుసార్లు మటన్..నాలుగు సార్లు చికెన్.. ఇవాళ్టి ( డిసెంబర్ 14 ) నుంచి హాస్టళ్లు, గురుకులాలకు కొత్త మెనూ

  • ఇయ్యాల్టి నుంచి హాస్టళ్లు, గురుకులాలకు కొత్త మెనూ
  • నాన్​వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్/ఫ్రైడ్ ఎగ్
  • బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, వడ, పూరి, రాగిజావ, పాలు విత్ బూస్ట్
  • స్నాక్స్ టైంలో పండ్లు, బాయిల్డ్ పల్లీలు, మిల్లెట్ బిస్కట్లు, అల్లం టీ
  • విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందేలా మార్పులు
  • ఇటీవల 40 శాతం డైట్ చార్జీలు పెంచిన ప్రభుత్వం
  • నేడు సీఎం, మంత్రులు, అధికారుల గురుకులాల పర్యటన
  • పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్

కరీంనగర్, వెలుగు: సర్కార్ హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు శనివారం నుంచి కొత్త మెనూ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు అమలవుతున్న డైట్ లో అనేక మార్పులు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వం మెనూ సిద్ధం చేసింది. లంచ్ లో నెలలో రెండు సార్లు మటన్, 4 సార్లు చికెన్ పెట్టనున్నారు. మిగతా రోజుల్లో బాయిల్డ్ ఎగ్, ఫ్రైడ్ ఎగ్ వడ్డించనున్నారు.

అలాగే బ్రేక్ ఫాస్ట్ లో రోజుకో తీరుగా కిచిడీ, చపాతీ, ఇడ్లీ, వడ, బోండా, పూరి, పులిహోర లాంటి టిఫిన్ తోపాటు రాగిజావ లేదంటే పాలు విత్ బూస్ట్ ఇవ్వనున్నారు. బ్రేక్ టైంలో ఏదైనా పండుతోపాటు స్నాక్స్ టైంలో రోజుకో ఐటెం తీరుగా బాయిల్డ్ పల్లీలు, పెసర్లు, బటానీలు, మిల్లెట్ బిస్కట్లు, అల్లం టీ అందించనున్నారు. శనివారం నుంచి ఈ కొత్త మెనూ సర్కార్ హాస్టళ్లలో అమల్లోకి రాబోతుంది. నెలలో ఒక్కో వారానికి ఒక్కో మెనూ చొప్పున నాలుగు వారాలకు చార్ట్ ను రూపొందించారు.

నెలలో ఆరు సార్లు నాన్ వెజ్..

సర్కార్ హాస్టళ్లలో ఇప్పటి వరకు ప్రతి ఆదివారం మాత్రమే చికెన్ పెడుతుండేవారు. కానీ ప్రభుత్వ హాస్టళ్ల చరిత్రలోనే తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టబోతున్నారు. నెలలో మొదటి ఆదివారం, మూడో ఆదివారం లంచ్ లో మటన్ కర్రీతో బగారా భోజనం పెట్టనున్నారు. అలాగే నెలలో మొదటి బుధవారం, మూడో బుధవారంతోపాటు రెండో ఆదివారం, నాలుగో ఆదివారం చికెన్ తోపాటు బగారా భోజనం  వడ్డించనున్నారు.

నాన్ వెజ్ భోజనం పెట్టినప్పడు సాంబార్, పెరుగు కూడా ఉంటుంది. నాన్ వెజ్‌‌‌‌‌‌‌‌తినని వారికి ఆ రోజుల్లో మీల్ మేకర్ కర్రీ పెట్టనున్నారు. నాన్ వెజ్ లేని మిగతా రోజుల్లో లంచ్ లో ఉడికించిన గుడ్డు లేదా ఫ్రైడ్ ఎగ్ ఇవ్వనున్నారు.

తీరొక్క టిఫిన్స్.. స్నాక్స్ లోకి పౌష్టికాహారం

ఇప్పటి వరకు గవర్నమెంట్ హాస్టళ్లలో బ్రేక్ ఫాస్ట్ గా రాగి జావా, కిచిడీ, ఉప్మా, ఇడ్లీ సాంబార్, టమాట రైస్ మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇక నుంచి సాంబర్ ఇడ్లీ, పల్లీ చట్నీతో  వడ, బోండా, మసాలా చోలేతో పూరి, ఆలూకుర్మతో చపాతీ, టమటా చట్నీతో కిచిడీ, జీరా రైస్, పుట్నాల చట్నీతో రైస్ పొంగల్, పులిహోర వడ్డించనున్నారు. టిఫిన్ తోపాటు రాగిజావ, బూస్ట్ తో కూడిన పాలు ఇవ్వనున్నారు. బ్రేక్ లోకి అరటిపండు, జామకాయ, పొప్పడి పండు, సపోటా, వాటర్ మెలన్ లాంటి పండ్లను మెనూలో చేర్చారు.స్నాక్స్ లో బాయిల్డ్ శనగలు, బాయిల్డ్ బొబ్బర్లు, బాయిల్డ్ పెసర్లు, బెల్లంతో ఫ్రైడ్ పల్లీలు, మిల్లెట్ బిస్కెట్స్, ఎగ్ బజ్జీ, ఉల్లిగడ్డ పకోడి, అల్లం టీని ఇవ్వనున్నారు.

8లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

మార్కెట్ లో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగినప్పటికీ.. విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచకపోవడంతో నాణ్యమైన భోజనం అందించలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో స్వల్పంగా డైట్ చార్జీలు పెంచిన అప్పటి ప్రభుత్వం ఆ తర్వాత పెంచలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకేసారి డైట్ చార్జీలను 40 శాతం పెంచింది.

3వ క్లాస్ నుంచి  7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి రూ.1330.. 8వ క్లాస్ నుంచి టెన్త్ వరకు రూ.1100 నుంచి రూ.1540కు, ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1500 నుంచి రూ.2100కు ప్రజా ప్రభుత్వం పెంచింది. 16 ఏండ్లుగా పెరగని కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచింది. డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీల పెంపుతో 8 లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారు.