- మొత్తం శాలరీలో 50 శాతానికి పెరనున్న బేసిక్ పే
బిజినెస్ డెస్క్,వెలుగు: చాలా మంది ఉద్యోగులకు శాలరీ ఎలా లెక్కిస్తారో పెద్దగా తెలియదు. బేసిక్ శాలరీ, ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇలా మొత్తం కలిపి గ్రాస్ శాలరీగా లెక్కిస్తారు. ఇంకా బేసిక్ శాలరీపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)ను, టీడీఎస్‌ను కట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘వేజ్ కోడ్, 2019’ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. లేబర్ చట్టాల్లో భాగంగా వీటిని తీసుకొస్తున్నారు. రాష్ట్రాలు వేజ్ కోడ్ కింద రూల్స్‌ను నొటిఫై చేశాక ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్తగా వచ్చే వేజ్ కోడ్ బట్టి ఉద్యోగుల శాలరీ ఎలా మారుతుందో కింద చూద్దాం..
బేసిక్ శాలరీ..
ప్రస్తుతం ఉద్యోగులకు అందే గ్రాస్ శాలరీలో బేసిక్ శాలరీ వాటా 35–40 శాతంగా ఉంటోంది. వేజ్ కోడ్,2019 బట్టి బేసిక్ శాలరీ వాటా మొత్తం శాలరీలో కనీసం 50 % ఉండాలి. బేసిక్ శాలరీలో 12 % వాటాను పీఎఫ్ కింద కట్ అవుతుంది. కంపెనీలూ కూడా ఇంతే మొత్తంలో ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్లకు కంట్రిబ్యూట్ చేయాలి. బేసిక్ శాలరీ పెరిగితే కంపెనీలు చెల్లించే పీఎఫ్ అమౌంట్ కూడా ఎక్కువవుతుంది. వేజ్‌కోడ్, 2019 కింద బేసిక్ శాలరీని పెంచుతామని 31% కంపెనీలు పేర్కొన్నాయని బ్రోకరేజి కంపెనీ డబ్ల్యూటీడబ్ల్యూ సర్వే వెల్లడించింది. మిగిలిన రెస్పాండెంట్లు ఇతర అలవెన్స్‌లను పెంచుతామని అన్నారు.
ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు..
కన్వెయన్స్ (ట్రాన్స్‌పోర్ట్) అలవెన్స్ శాలరీలో ఒక భాగం. దీనిపై ట్యాక్స్ పడుతుంది కూడా. నెలకు రూ. 1,600 వరకు కన్వెయన్స్ అలవెన్స్ కింద కేటాయిస్తారు. కొత్త వేజ్‌కోడ్ బట్టి చూస్తే కన్వెయన్స్ అలవెన్స్ శాలరీ డెఫినెషన్‌కు వెలుపల ఉంటుంది. అందువలన దీనిని సపరేట్ కాంపోనెంట్‌గానే చూస్తారు.
పీఎఫ్ కంట్రిబ్యూషన్..
బేసిక్ శాలరీలో 12 శాతాన్ని పీఎఫ్ కింద ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లకు కంపెనీలు యాడ్ చేస్తున్నాయి. ఇంకో పీఎఫ్ రూల్ బట్టి చూస్తే నెలకు రూ. 15,000 (లిమిట్) పై 12 శాతం అమౌంట్ (నెలకు రూ. 1,800) ను పీఎఫ్ కింద కంపెనీలు కంట్రిబ్యూట్ చేయొచ్చు. కొత్త శాలరీ డెఫినెషన్ వచ్చినా రూ.15,000 లిమిట్ కొనసాగుతుంది. కొన్ని కంపెనీలు ఈ పీఎఫ్ రూల్‌ను పాటించొచ్చు. మరికొన్ని కంపెనీలు కొత్త వేజ్ కోడ్‌లోని పీఎఫ్ రూల్‌ను పాటించొచ్చు.
గ్రాట్యుటీ..
గ్రాట్యుటీని ఉద్యోగి మానేసటప్పుడు ఇస్తారు. కంపెనీలు గ్రాట్యుటీని ఒక ఫార్ములా బట్టి లెక్కిస్తాయి. ఉద్యోగి చివరి నెలలో తీసుకున్న శాలరీ, పనిచేసిన సంవత్సరాలను 15 తో గుణించి, ఈ వచ్చిన అమౌంట్‌ను 30 తో భాగిస్తారు. ఈ అమౌంట్‌ను గ్రాట్యుటీగా ఇస్తారు. అంటే ఉద్యోగి శాలరీ రూ.50 వేలు అనుకుంటే, ఐదేళ్లు కంపెనీలు పనిచేశాడని అనుకుంటే ఆ ఉద్యోగికి వచ్చే గ్రాట్యుటీ రూ. 1.25 లక్షలుగా ఉంటుంది. గ్రాట్యుటీ పొందడానికి ఉండే అర్హత ‘కనీసం 5 ఏళ్లు పనిచేయాలి’ అనే రూల్‌ను కొత్తగా తీసుకురానున్న సోషల్ సెక్యూరిటీ కోడ్,2020 తొలగించింది. తక్కువ కాలం పనిచేసినా ఉద్యోగులు కూడా గ్రాట్యుటీ పొందడానికి అర్హులే. ఇంకా లేబర్ కోడ్స్ బట్టి గ్రాట్యుటీని కొత్త బేసిక్ శాలరీ (కొత్త రూల్–మొత్తం శాలరీలో 50 శాతం) పై లెక్కిస్తారు.
