సరికొత్తగా మోడీ టీమ్..కేంద్ర కేబినెట్ విస్తరణ ఇయ్యాల్నే

సరికొత్తగా మోడీ టీమ్..కేంద్ర కేబినెట్ విస్తరణ ఇయ్యాల్నే

సరికొత్త మోడీ టీమ్ రెడీ అయింది. ఇయ్యాల సాయంత్రం కల్లా కొత్త మంత్రులెవరో తేలిపోనుంది. 22 నుంచి 29 మంది వరకు కేబినెట్​లోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ఇప్పటికే పేర్లను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అన్ని వర్గాలు, అన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని లిస్టు తయారు చేశారు. జ్యోతిరాదిత్య సింధియా, శర్బానంద సోనోవాల్, సుశీల్ మోడీ, పశుపతి పరాస్ తదితరుల పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం.

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. దీనిపై బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రకటన వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్​తో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశంలో ఫైనల్ లిస్టు తయారు చేసినట్లు వెల్లడిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌‌నాథ్ సింగ్‌‌తో మీటింగ్ జరగాల్సి ఉన్నా అది రద్దయింది. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 53 మందితో నరేంద్ర మోడీ కేబినెట్ ఏర్పాటైంది. ఆ తర్వాత విస్తరణ జరగలేదు. కేంద్ర కేబినెట్ లో గరిష్టంగా 81 మందిని మంత్రులుగా నియమించుకునేందుకు అవకాశం ఉంది. గెహ్లాట్‌‌ను గవర్నర్‌‌‌‌గా నియమించడంతో ఒక బెర్తు ఖాళీ అయింది. దీంతో గరిష్టంగా మరో 29 మందికి మంత్రి పదవులు ఇచ్చేందుకు చాన్స్ ఉంది.

కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా చేరబోయే వాళ్లలో జ్యోతిరాదిత్య సింధియా, శర్బానంద సోనోవాల్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు పశుపతి పరాస్, నారాయణ్ రాణే, సకల్‌‌దీప్ రాజ్‌‌భర్, పంకజ్ చౌధురి, అనుప్రియ పటేల్, రీటా బహుగుణ జోషి, రామ్ శంకర్ కథేరియా, వరుణ్ గాంధీ, ఆర్సీపీ సింగ్, లల్లన్ సింగ్, రాహుల్ కశ్వాన్, సీపీ జోషి, రంజన్ సింగ్ రాజ్‌‌కుమార్ తదితరులు లిస్టులో ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  వీరిలో కొందరు ఇప్పటికే ఢిల్లీ వెళ్లగా.. మరికొందరు దేశ రాజధానికి పయనమయ్యారు. సుశీల్ మోడీ, భూపేంద్ర యాదవ్, అనిల్ జైన్, జాఫర్ ఇస్లామ్ కు కూడా కేబినెట్ బెర్త్ దొరకనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అజయ్ భట్, అనిల్ బలూని, ప్రతాప్ సింహా, బ్రిజేంద్ర సింగ్, పూనమ్ మహాజన్, ప్రీతమ్ ముండే, పర్వేశ్ వర్మ, మీనాక్షీ లేఖి, శుభాన్షు త్రివేది, అశ్విని వైష్ణవ్, నరసింహారావు పేర్లు వినిపిస్తున్నాయి.ఢిల్లీకి వెళ్లడానికి ముందు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సింధియా పూజలు చేశారు. ఎల్జేపీ నేత పశుపతి పరాస్.. ఢిల్లీలో కుర్తా షాపింగ్ చేస్తూ కనిపించారు. కేంద్రం నుంచి పిలుపు వచ్చిందా? అని మీడియా అడగ్గా.. ‘‘రహస్యాన్ని రహస్యంగానే ఉండనివ్వండి” అని బదులిచ్చారు. 

యంగెస్ట్ కేబినెట్!

తాజా విస్తరణతో దేశ చరిత్రలోనే తొలి ‘యంగెస్ట్ కేబినెట్‌‌’గా నిలవనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్ర మంత్రుల సగటు వయసు చాలా తక్కువగా ఉంటుందని చెప్పాయి. మహిళా మంత్రుల సంఖ్య పెరుగుతుందని, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌‌పీరియన్స్ ఉన్న వారికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పిస్తారని వెల్లడించాయి. చిన్న వర్గాలను కేబినెట్‌‌లోకి చేర్చుకోవాలన్నది ప్రభుత్వ ప్లాన్ అని, మొత్తం 24 మంది దాకా ఓబీసీలకు చోటు దక్కుతుందని పేర్కొన్నాయి. ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్పాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించాయి.

వీరికి అవకాశం 

  • శర్బానంద సోనోవాల్​
  • సుశీల్​ మోడీ
  • నారాయణ్​ రాణె
  • హీనా గవిట్​
  • ప్రీతం ముండే
  • జాఫర్​ ఇస్లాం
  • అనుప్రియ పటేల్​
  • లాకెట్​ చటర్జీ
  • దిలీప్ ​ఘోష్​
  • శంతను ఠాకూర్​
  • తీరథ్​సింగ్​ రావత్​
  • పశుపతి కుమార్​ పరాస్​
  • శివ ప్రతాప్ ​శుక్లా
  • సునీత దుగ్గల్​
  • ఆర్​సీపీ సింగ్​
  • లలన్​ సింగ్​
  • రాహుల్​ కేశ్వన్​
  • అశ్వినీ వైష్ణవ్​
  • మీనాక్షి లేఖి
  • మనోజ్​ తివారి
  • జామ్యంగ్​ షెరింగ్​ 
  • నామ్​గ్యల్​​
  • వినోద్​ సోంకర్​