జనవరి 15కల్లా స్టేట్​కు బీజేపీ కొత్త చీఫ్

ఆలోపు మండల,జిల్లా అధ్యక్షుల ప్రక్రియ పూర్తి
పార్టీ చీఫ్ నడ్డా ఆధ్వర్యంలో‘సంఘటన్ పర్వ్’ భేటీ
రాష్ట్రం నుంచి హాజరైన లక్ష్మణ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ

న్యూఢిల్లీ, వెలుగు: జనవరి 15 కల్లా రాష్ట్రానికి బీజేపీ చీఫ్ ఎవరనేది ఫైనల్ కానున్నది. అంతకుముందే జిల్లా, మండల పదాధికారుల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఈ మేరకు ‘సంఘటన్ పర్వ్’ పేరుతో ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్​లో ఆదివారం సంస్థాగత ఎన్నికల సమీక్షా సమావేశం నిర్వహించింది. పార్టీ చీఫ్ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) బీఎల్ సంతోష్, నేషనల్ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎన్నికల ఇన్​చార్జ్​లు, కో ఇన్​చార్జ్​లు పాల్గొన్నారు. 

తెలంగాణ నుంచి పార్టీ సం స్థాగత ఎన్నికల ఇన్​చార్జ్ లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు.  రాష్ట్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు, బూత్ లెవల్, మండల స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియపై కిషన్ రెడ్డి వివరించారు. 70 శాతం బూత్, మండల స్థా యి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. హైకమాండ్ ఆదేశాల మేరకు జనవరి ఫస్ట్ వీక్​లో పదాధికారుల, సెకండ్ వీక్​లో జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను కంప్లీట్ చేసేందుకు కృషి చేస్తామన్నారు. 

స్టేట్ చీఫ్ ఎవరు?

బీజేపీ హైకమాండ్.. రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. స్టేట్​కు కాబోయే కొత్త బాస్ ఎవరన్నదానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని హైకమాండ్ యోచిస్తున్నది.  స్టేట్ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో ఎంపీలు ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, పార్టీ సీనియర్లు రాంచందర్, ఇతర స్టేట్ పదాధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాగా, మరోసారి బండి సంజయ్​కే అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలను హైకమాండ్​లోని పలువురు నేతలు ఖండించారు. 

తెలంగాణపై హైకమాండ్ నజర్

జనవరి 15 నాటికి 50% రాష్ట్రాల్లో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ టార్గెట్ పూర్తికాగానే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మెంబర్ షిప్ డ్రైవ్ ను వేగంగా పూర్తి చేసింది. అలాగే.. బూత్, మండల స్థాయిలో పార్టీ బలో పేతంపై ఫోకస్ పెట్టింది. ఇందుకు తగ్గట్లుగా తెలంగాణపై కూడా పార్టీ పెద్దలు నజర్ పెట్టారు. ఈ దిశగా బూత్, మండల స్థాయి అధ్యక్ష పదవిని 45 ఏండ్లలోపు వారికే కట్టబెట్టింది.