వాటిని ఆరెంజ్‌లతో పోల్చడమేంటి..? వివాదంలో యువీ ఫౌండేషన్ 

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్థాపించిన క్యాన్సర్ ఫౌండేషన్ YouWeCan వివాదంలో చిక్కుకుంది. రొమ్ము క్యాన్సర్(Breast Cancer)పై అవగాహన కల్పించే నెపంతో ప్రకటనలో రొమ్ములను ఆరెంజ్‌లతో పోల్చడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

క్యాన్సర్ తో పోరాడి జయించిన మాజీ దిగ్గజం యువరాజ్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా 2012లో YouWeCan అనే ఫౌండేషన్ స్థాపించారు. ఇటీవల ఈ సంస్థ రొమ్ము క్యాన్సర్ పై మహిళలలో అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో అక్కడక్కడ ప్రకటనలు అతికించింది. ఆ యాడ్స్ లో రొమ్ములను ఆరెంజ్‌లతో పోల్చారు. 

"నెలకు ఒకసారైనా మీ ఆరెంజ్‌లను తనిఖీ చేసుకోండి.." అని YouWeCan ఫౌండేషన్ యాడ్స్ లో ఉంది. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ద్వారా జీవితాన్ని రక్షించుకోగలమనే సందేశాన్ని వ్యాప్తి చేసేలా ఈ ప్రకటన ఉంది. పోస్టర్‌లో ఒక యువతి రెండు నారింజ పండ్లను పట్టుకుని బస్సులో నిలబడి ఉండగా, పలువురు వృద్ధ మహిళలు ఆమె వైపు చూస్తూ ఉన్నారు. వృద్ధ మహిళల్లో ఒకరు తన వద్ద నారింజ పండ్ల పెట్టెను కలిగి ఉన్నారు. ఇదే మహిళలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 

యువీకి ప్రశ్నల వర్షం

"రొమ్ము" అనే పదాన్ని ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడని మీరు, ఈ సమాజంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై ఎలా అవగాహన పెంచుతారు..? అని మహిళలు ప్రశిస్తున్నారు. అమ్మతనాన్ని పండ్లతో పోలుస్తూ నలుగురిలో చూపెట్టడం ద్వారా యువతలో చెడు సంకేతాలు తీసుకెళ్లే ప్రమాదం ఉందని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ ప్రచారాన్ని ఎవరు ఆమోదించారు..? ఈ పోస్టర్‌ను పబ్లిక్‌గా మార్చేంత మూర్ఖులు మనల్ని పరిపాలిస్తున్నారా..? పోస్టర్‌ చూసిన ప్రతిసారి సిగ్గుగా, ఇబ్బందికరంగా ఉంది. మహిళలకు ఇంతకంటే అవమానకరమైనది మరొకటి ఉందా..? అంటూ మహిళలు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొందరు యువరాజ్ సింగ్‌ను ట్యాగ్ చేసి , ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

ALSO READ | IND vs NZ 2nd Test: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే పైచేయి

వస్తున్న విమర్శలపై YouWeCan ఫౌండేషన్ స్పందించింది. ఇది చిన్న విషయమని కొట్టి పారేసింది. "రొమ్ము క్యాన్సర్ గురించి ప్రజలు బహిరంగంగా మాట్లాడేలా చేయడం ఎంత కష్టమో మాకు ప్రత్యక్షంగా తెలుసు. ఆరెంజ్‌లను ఉపయోగించడం అనేది ఒక సాహసోపేతమైన  నిర్ణయం.. ఎంతో జాగ్రత్తగా ఆలోచించాక తీసుకున్న నిర్ణయం. ప్రాణాంతక వ్యాధి గురించి ప్రజలను మాట్లాడేలా చేసింది. ప్రకటన సున్నిత మనస్కులను నొప్పించొచ్చు కానీ, ఇది మరీ చెడు సంకేతాలు తీసుకెళ్లేది కాదు. " అని తెలిపింది.