నీట్ అభ్యర్థిని అనుమానాస్పద మృతి.. ఆదిభట్ల అగస్త్య జూనియర్ కాలేజీలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: కాలేజీ హాస్టల్లో ఉంటూ నీట్ లాంగ్​ టర్మ్ ​కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదిబట్ల సీఐ రాఘవేందర్​రెడ్డి వివరాల ప్రకారం.. మహబూబాబాద్ ​జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లికి చెందిన మైలపాకం అర్జున్, లక్ష్మి దంపతులు. ఉపాధి కోసం ఘట్​కేసర్కు వచ్చి నివాసం ఉంటున్నారు.

వీరి మూడో కుమార్తె సోనీ(19) బైపీసీ పూర్తి చేసి, ఆదిబట్లలోని అగస్త్య జూనియర్ కాలేజీ హాస్టల్లో ఉంటూ నీట్ లాంగ్ టర్మ్​ కోచింగ్​తీసుకుంటుంది. జనవరి 4న మధ్యాహ్నం ఆమె అనారోగ్యానికి గురికావడంతో కాలేజీ యాజమాన్యం మన్నెగూడలోని మహోనియా హాస్పిటల్కు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం హాస్టల్కు తీసుకొచ్చారు.

అర్ధరాత్రి జ్వరం తీవ్రం కావడంతో అదే ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తుండగా, ఆదివారం తెల్లవారుజామున మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో సోనీ మృతిపై విచారణ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. 

అగస్త్య జూనియర్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆదిబట్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేశారు.