- నీలం మధు
పటాన్చెరు, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని కాంగ్రెస్ సీనియర్నేత నీలం మధు అన్నారు. శనివారం పటాన్ చెరు మండలం బచ్చుగూడ జీపీ పరిధిలో నియోజకవర్గ ఇన్చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ సాయి కుమార్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఏడాదిలోనే సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు పాలనను చూపిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని విడతల వారీగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరి చేసే విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని దశలవారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాట సుధారాణి, ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు పాల్గొన్నారు.