ప్రజల ప్రాణాల రక్షణే మా ధ్యేయం

ప్రజల ప్రాణాల రక్షణే మా ధ్యేయం
న్యూఢిల్లీ: ప్రజల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్ సేఫ్టీ మంత్‌‌ను ప్రారంభించిన గడ్కరీ.. ప్రమాదాలు, రోడ్ల నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ యాక్సిడెంట్లలో మరణిస్తున్న వారిలో 18-45 ఏళ్ల లోపు వారి సంఖ్య 70 శాతానికి పైగా ఉందని గడ్కరీ అన్నారు. రోడ్ యాక్సిడెంట్స్‌‌లో ప్రతి రోజూ సగటున 415 మంది చనిపోతున్నారని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత తమ మీద ఉందన్నారు. ‘రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను 50 శాతానికి తగ్గిస్తామని వాగ్దానం చేశాం. దీన్ని తమిళనాడు సాధించింది. ఆ రాష్ట్రం 53 శాతం సక్సెస్ రేటును నమోదు చేసింది. 2025లోపు అన్ని రాష్ట్రాలు దీన్ని చేరుకోవాల్సి ఉంది. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. దేశంలో పెద్ద ఎత్తున కొత్త రోడ్ల నిర్మాణానికి సంకల్పించాం. ఇప్పటికే ప్రతి రోజు 30 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణపు టార్గెట్‌ను చేరుకున్నాం. మార్చి ముగిసేలోపు ప్రతి రోజు 40 కిలో మీటర్ల రోడ్ల నిర్మాణం టార్గెట్‌‌ను చేరుకుంటామని ఆశిస్తున్నాం. వరల్డ్ బ్యాంక్‌‌తోపాటు ఏషియా డెవలప్‌‌‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఈ ప్రాజెక్టులకు చెరో రూ.7 వేల కోట్లను అప్రూవ్ చేశాయి. త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఆమోదం లభించనుంది. రోడ్ల మీద డెత్ స్పాట్స్‌‌ను నిరోధించడానికి రూ.14 వేల కోట్లను వెచ్చించాలని నిర్ణయించాం’ అని గడ్కరీ పేర్కొన్నారు.