మరింత సమన్వయంతో ముందుకెళ్దాం..ఎన్డీయే నేతల సమావేశంలో నిర్ణయం

న్యూఢిల్లీ: పార్లమెంట్ లోపలా, బయటా ప్రత్యర్థి పక్షాలను ఎదుర్కొనేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని ఎన్డీయే నేతలు నిర్ణయించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని బుధవారం (డిసెంబర్ 25) న ఢిల్లీలోని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయేపక్షాల ముఖ్యనేతలు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన రాజ్యాంగపరమైన అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల బిల్లును ఇప్పటికే జేపీసీకి పంపినందున అక్కడ కూడా సమన్వయంగా పనిచేయాల్సిన వ్యహాలపై చర్చించినట్లు సమాచారం. 

ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, జేడీయూ నేత రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర మంత్రులు అనుప్రియా పటేల్, హెచ్‌డీ కుమారస్వామి పాల్గొన్నారు.

ALSO READ | ఫస్ట్ బోన్ డొనేషన్..యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి..ఆరుగురు పిల్లలకు లైఫ్ ఇచ్చాడు

అధికారిక ఎజెండా ఏదీ బహిర్గతం కానప్పటికీ వాజ్‌పేయి పరిపాలనలోని కీలకమైన ఇతివృత్తాన్ని ప్రతిబింబించే సుపరిపాలన,రాజకీయ వ్యూహాల చుట్టూ చర్చలు సాగాయని తెలుస్తోంది. ఎన్డీయేలో సమన్వయాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 

కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ

ఎన్డీయే భేటీ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 15 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. 

ఆ తర్వాత నడ్డా నివాసంలోనే కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి సీఎం చంద్రబాబును కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను గట్టెక్కించడంపై చర్చించారు. అనంతరం రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తో చంద్రబాబుతో భేటీ అయ్యారు. రైల్వే జోన్‌ సహా, రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.