న్యూఢిల్లీ: ఓబీసీలకు ఇచ్చే రిజర్వేషన్లపై రాష్ట్రాలే ప్రత్యేక లిస్టు తయారు చేసుకునేలా అధికారం కల్పిస్తూ ఇటీవలే జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కల్పించిన ఈ అధికారంతో ఎటువంటి ప్రయోజనం లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఈ అంశంపై సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండ్రోజుల క్రితం రాష్ట్రాలు ఓబీసీ రిజర్వేషన్స్ లిస్టు ప్రిపేర్ చేయాలని కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను కోరిందని, దీని ద్వారా ప్రజలను కేంద్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని శరద్ పవార్ ఆరోపించారు. ఈ కొత్త రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఇచ్చేయవచ్చన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కానీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఉందని, ఈ లిమిట్‌ను దాటి రిజర్వేషన్లు ఇవ్వొద్దని సుప్రీం కోర్టు అనేకసార్లు గట్టిగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు.
అయితే ఇప్పుడు రాష్ట్రాలు సొతంగా ఓబీసీ రిజర్వేషన్ల జాబితాను తయారు చేయొచ్చని, ఏ కులాలు ఓబీసీలుగా ఉండాలన్నది సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని శరద్ పవార్ అన్నారు. కానీ కేవలం ఇలా సొంతంగా ఓబీసీల జాబితాను తయారు చేసుకునే అవకాశం ఇవ్వడం ద్వారా ఏ లాభమూ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని శరద్ పవార్ అన్నారు.
Now, the Centre has said that State Govts can prepare lists for OBC reservation and take a decision on it on their own level. But this will be of no benefit because almost all states have crossed the 50% mark. It's important to bring this before the public: NCP chief Sharad Pawar
— ANI (@ANI) August 16, 2021
