12వ తరగతి చరిత్ర పుస్తకంలోని ‘మొఘల్ సామ్రాజ్యం’ చాప్టర్లను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT ) తొలగించడంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. అయితే ఎందుకు మొఘల్ సామ్రాజ్యం చాప్టర్లను 12వ తరగతి పుస్తకంలో నుంచి తొలగించారన్న దానిపై NCERTకి చెందిన ఉన్నతాధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్యార్థులపై భారాన్ని తగ్గించడంతో పాటు..సిలబస్ను సవరించడానికి మొఘల్ సామ్రాజ్యం పాఠంలోని కొన్ని ఆధ్యాయాలను తొలగించామని NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ చెప్పారు.
కోవిడ్-19 మహమ్మారి వల్ల తీవ్రంగా ప్రభావితమైన విద్యార్థులపై భారాన్ని తగ్గించడానికి "వృత్తిపరమైన వ్యాయామం"లో భాగంగా ఈ పాఠ్యపుస్తకాలను సవరించినట్లు వెల్లడించారు.
రాజకీయ ఉద్దేశం లేదు..
మొఘల్ సామ్రాజ్యం చాప్టర్లను తొలగించడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ స్పష్టం చేశారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా విద్యార్థులు చాలా బాధలకు గురయ్యారని NCERT డైరెక్టర్ పేర్కొన్నారు. లెర్నింగ్ లాస్ కారణంగా విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు అధ్యాయాలను తొలగించి సిలబస్‌ను సవరించామన్నారు. "ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి, సమాజం, దేశం పట్ల బాధ్యతగా, పాఠ్యపుస్తకాలలోని కంటెంట్ లోడ్ తగ్గించాలని భావించాం" అని సక్లానీ పేర్కొన్నారు.
12వ తరగతి చరిత్ర పుస్తకంలోని ‘మొఘల్ సామ్రాజ్యం’ చాప్టర్లను NCERT తొలగించింది. ఈ మార్పు దేశవాప్తంగా NCERTని అనుసరించే అన్ని స్కూళ్లకు వర్తించనుందని పేర్కొంది. థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్-2లో ఉన్న ‘కింగ్ అండ్ క్రానికల్స్: ది మొఘల్ కోర్ట్స్ (సీ.16,17వ శతాబ్దాలు) అధ్యాయాలను కూడా NCERT పూర్తిగా తొలగించింది. హిస్టరీతోపాటు హిందీ, సివిక్స్ పుస్తకాల్లోనూ మార్పులు చేసింది. ‘అమెరికన్ హెజిమోనీ ఇన్ వరల్డ్ పాలిటిక్స్’, ‘ది కోల్డ్ వార్ ఎరా’ అనే రెండు అధ్యాయాలను తొలగించింది. 10వ తరగతి పుస్తకం ‘డెమోక్రటిక్ పాలిటిక్స్-2’ నుంచి ‘ప్రజాస్వామ్యం మరియు వైవిధ్యం’, ‘ప్రజాపోరాటాలు మరియు ఉద్యమాలు’, ప్రజాస్వామ్య సవాళ్లు’ వంటి అధ్యాయాల్లోనూ మార్పులు చేసింది. 11వ తరగతి పాఠ్యపుస్తకం ‘థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ’ నుండి ‘సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్’, క్లాష్ ఆఫ్ కల్చర్స్’, ‘ఇండస్ట్రియల్ రివల్యూషన్’ వంటి అధ్యాయాలు తొలగించబడ్డాయి. ఈ మార్పులు 2023-24 విద్యా సంవత్సరం నుంచే అమలవుతాయని NCERT పేర్కొంది.
