- మాజీ క్రికెటర్ సిద్దూ పై శిరోమణి అకాలీదళ్ ఫైర్
చండీఘడ్: పంజాబ్ లో సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింత్ సిద్ధుపై ప్రతిపక్ష శిరోమణి అకాళిదళ్ నేతలు నిప్పులు చెరిగారు. ప్రజల దృష్టి మళ్లించడానికి.. మభ్యపెట్టడానికి డ్రామాలు ఆడుతున్నారని శిరోమణి అకాలిదళ్ నేతలు ధ్వజమెత్తారు. పంజాబ్ లో తీవ్ర విద్యుత్ కొరత నేపధ్యంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విద్యుత్ కోతలు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం నిర్ణయాలపై సొంత పార్టీకే చెందిన నవజ్యోత్ సింగ్ సిద్దూ బహిరంగంగా విమర్శలు గుప్పించడం కలకలం రేపింది. పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడన్న ఊహాగానాల నేపధ్యంలో ఆయన మరుసటి రోజు ప్రియాంకా గాంధీతో.. మరుసటి రోజు రాహుల్ గాంధీతో సమావేశం అయిన విషయం తెలిసిందే.
సిద్ధూ విమర్శలను ప్రస్తావిస్తూ శిరోమణి అకాలిదళ్ నేతలు ప్రభుత్వాన్ని, సిద్ధూను నిలదీశారు. ముందు 8 నెలలుగా మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టడం లేదు. మొత్తం 8 నెలల కరెంటు బిల్లు రూ.8 లక్షల 67 వేల 540 రూపాయలు బకాయి చెల్లించాల్సి ఉంది. కరెంటు బిల్లు చెలించకుండా డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీలకు కరెంటు నిలిపేస్తూ పొదుపు చర్యలు తీసుకుంటుంటే మీ పార్టీ నేత కరెండు బిల్లు భారీగా బకాయిపెట్టి ఎగనామం పెట్టాలని చూస్తున్నాడని ఆరోపించారు. కాగా పంజాబ్ లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. తీవ్ర కరెంటు సమస్యలతో సతమతమవుతున్న పంజాబ్ రాష్ట్రంలో 300 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ప్రకటన.. సిద్దూతోపాటు ఇతరుల కరెంటు బకాయిల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
