నేషనల్ హైవే పనులకు ఫారెస్ట్​ గండం

 

  • అటవీ అనుమతులు రాక పలుచోట్ల ప్రారంభం కాని పనులు
  • ఇప్పటివరకు 70 శాతం పనులే పూర్తి
  • పందిళ్ల వద్ద భూసేకరణ పెండింగ్
  • వాహనదారులకు తప్పని తిప్పలు

సిద్దిపేట, వెలుగు: ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు జరుగుతున్న నేషనల్ హైవే 765 డీజీ పనులు స్లోగా జరుగుతున్నాయి. రెండేళ్ల కింద ప్రారంభమైన పనులు ఈ డిసెంబర్ నాటికి పూర్తిచేయాల్సి ఉన్నా కేవలం 70 శాతం పనులే పూర్తయ్యాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు నేషనల్​హైవే పనులను 2022 లో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.

మొత్తం 133 కిలోమీటర్ల హైవే కోసం రూ.1461 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీలో మెదక్ నుంచి సిద్దిపేట వరకు 69 కిలోమీటర్లకు రూ. 822 కోట్లు, రెండో ప్యాకేజీలో సిద్దిపేట నుంచి ఎల్క తుర్తి వరకు 63 కిలో మీటర్లకు రూ.579 కోట్లు కేటాయించారు. 

ఈ నెలతో ముగుస్తున్న గడువు

రెండో ప్యాకేజీ కింద సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు రోడ్డు పనులను ఈ  డిసెంబర్ 21 వరకు పూర్తి చేయాల్సి ఉన్నా ఆ దిశగా పనులు జరగలేదు. రెండేళ్లలో కొన్ని చోట్ల పనులు పూర్తి కాగా మరికొన్నిచోట్ల స్లోగా సాగుతున్నాయి. ఇంకా కొన్ని గ్రామాలు, పట్టణాల పరిధిలో 8 నుంచి 10 మీటర్ల వెడల్పుతో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. హుస్నాబాద్ మున్సిపాల్టీ పరిధిలో ఇటీవల విస్తరణ పనులు ప్రారంభించారు. పలుచోట్ల లో లెవల్ బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతుండడంతో తాత్కాలిక రోడ్ల ద్వారా వాహనాలను మల్లిస్తున్నారు. ఇలాంటి చోట్ల సరైన విధంగా సూచికలు ఏర్పాటు చేయక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

రెండు చోట్ల ముందుకు సాగని పనులు

ఎల్కతుర్తి సిద్దిపేట నేషనల్​హైవే పనుల్లో భాగంగా పందిళ్ల, కోహెడ క్రాసింగ్ వద్ద పనులు పెండింగ్ లో పడ్డాయి. పందిళ్ల వద్ద 400 మీటర్ల వెడల్పుతో  టోల్ ప్లాజా ఏర్పాటు చేస్తుండగా దీనికి సంబంధించి  రెవెన్యూ శాఖ అవార్డు ప్రక్రియను పూర్తి చేసినా  కాంట్రాక్టర్ కు పొజిషన్ చూపకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కోహెడ క్రాసింగ్ నుంచి నాగ సముద్రాల వరకు అటవీ శాఖ అనుమతులు లభించకపోవడంతో పనులు మొదలుపెట్టలేదు. ఈ ప్రాంతంలో దాదాపు 1.5 కిలో మీటర్ల మేర మలుపులు ఉండడంతో స్థల సేకరణ అనివార్యమైంది. ఈ ప్రాంతం అటవీ శాఖ పరిధిలో ఉండంతో వారి అనుమతి లభిస్తేనే పనులు ముందుకు సాగుతాయి.

ప్రమాదాలతో వాహనదారుల ఆందోళన

నేషనల్​ హైవే పనులు స్లోగా జరుగుతుండడంతో పలుచోట్ల రోడ్లను డైవర్ట్ చేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలువురు రాత్రిపూట ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతుండగా మరికొందరు  తాత్కాలికంగా మట్టి రోడ్ల వల్ల దుమ్ము, ధూళితో ఇబ్బందులు ఎదుర్కొటున్నారు.  కాంట్రాక్టర్ మట్టి రోడ్లపై దుమ్ము లేవకుండా తూతూ మంత్రంగా నీళ్లు చల్లి చేతులు దులుపుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నేషనల్​హైవే పనులను స్పీడ్​గా పూర్తిచేయాలని వాహనదారులు కోరుతున్నారు. 

ALSO READ : ఆదిలాబాద్​లో ఢిల్లీస్థాయి టెంపరేచర్లు

త్వరలో పనులను పూర్తి చేస్తాం

ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు నేషనల్ హైవే పనులను స్పీడ్​గా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు 70 శాతం పనులను పూర్తి చేశాం. వచ్చే మార్చి వరకు మిగిలిన 25 శాతం పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. పందిళ్ల వద్ద టోల్ ప్లాజా భూసేకరణలో జాప్యం, కోహెడ క్రాసింగ్ వద్ద అటవీశాఖ అనుమతులు లభించక పోవడం వల్ల పనులను ప్రారంభించలేదు. పనులు జరుగుతున్న చోట ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
‌‌ - మనోహర్, డీఈ, నేషనల్ హైవే