ఈడీ ఎదుట హాజరు కానున్న సోనియా

ఈడీ ఎదుట హాజరు కానున్న సోనియా

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించనున్నారు. సోనియా గతంలోనే ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కరోనా సోకడం, ఆ తర్వాత అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో జాయిన్ కావడంతో సాధ్యం కాలేదు. దీంతో దర్యాప్తు అధికారులు జులై 21న విచారణకు హాజరుకావాలని మళ్లీ సమన్లు పంపారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ గురువారం ఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హెడ్ ఆఫీసుకు వెళ్లనున్నారు. 

సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శలకు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమైంది. మోడీ సర్కారు దర్యాప్తు  సంస్థలను పావులుగా వాడుకుంటోందని ఆరోపిస్తున్న నేతలు, కార్యకర్తలు ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం రాజ్ భవన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు నిర్ణయించారు. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఈడీ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విచారించింది. దాదాపు ఐదురోజుల పాటు ప్రశ్నించింది. 


నేషనల్ హెరాల్డ్ పత్రికను కొనుగోలుకు కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2012లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసు పెట్టారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా యూపీ, ఢిల్లీతో పాటు ప‌లు ప్రాంతాల్లోని రూ. 1,600 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తులను స్వాధీనం చేసుకున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌ను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఆర్థిక ఇబ్బందులతో గతంలోనే మూతపడింది.