అమరావతి: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీపై విశ్రాంత న్యాయమూర్తి శేషశయన రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ ఎన్జీటీకి నివేదిక సమర్పించారు. స్టైరిన్ గ్యాస్ లీకేజీ మానవ తప్పిదం, భద్రతా ప్రమాణాల వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు.
నివేదికలో.. ఎల్జీ పాలిమర్స్ నిర్లక్ష్యాన్ని, తప్పిదాలను కమిటీ ఎండగట్టింది. ఐదు కీలక తప్పిదాలను బయటపెట్టింది. స్టైరిన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ స్టోరేజ్ తగినంత అందుబాటులో లేదని కమిటీ తేల్చింది. ఆక్సిజన్ ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయట్లేదని వెల్లడించారు. ఉష్ణోగ్రతలను పర్యవేక్షణ చేసే వ్యవస్థను కూడా సరిగ్గా పాటించలేదని తేల్చింది. రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ను 24 గంటలపాటు ఆపరేట్ చేయలేదని తెలిపింది, ప్లాంట్ లోనూ, ప్లాంట్ లోని స్టోరేజ్ ట్యాంక్ వద్ద పర్సన్ ఇన్ చార్జ్ ల నిర్లక్ష్యం, తప్పిదం స్పష్డంగా ఉందని కమిటీ చెప్పింది.
దీంతో.. ఎన్జీటీ విచారణ కమిటీ నివేదికపై అభ్యంతరాలను ఒకరోజులో చెప్పాలని ఎన్జీటీ ఆదేశించింది. సోమవారం సాయంత్రం లేక మంగళవారం ఎన్జీటీ తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎల్జీ పాలిమర్స్ తరపున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్ర వాదనలు వినిపించారు.. గ్యాస్ లీకేజీ ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎన్జీటీకి లేదని వాదనలు వినిపించారు.. ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందన్నారు.
మరోవైపు, 2001 నుంచి అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ వాదనలు వినిపించారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఏపీ పొల్యూషన్ బోర్డుతో కుమ్మక్కైందని, గ్యాస్ లీకేజీ ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుమోటోగా కేసు విచారణ వద్దంటున్న నేపథ్యంలో తన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని నోటీసులు ఇవ్వాలని ఈఏఎస్ శర్మ కోరారు.

