IND vs AUS: బాక్సింగ్ డే టెస్ట్ కల చెదిరింది.. స్క్వాడ్ నుంచి తప్పించడంపై మెక్‌స్వీనీ ఆవేదన

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరగబోయే చివరి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టును శుక్రవారం (డిసెంబర్ 20) ప్రకటించారు.  14 మందితో కూడిన సభ్యులతో కూడిన ఈ జట్టులో గత మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఫెయిలైన నేథన్‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌స్వీని స్క్వాడ్ నుంచి  తప్పించారు. 6 ఇన్నింగ్స్ లో ఈ యువ ఆటగాడు కేవలం 72 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియా జట్టులో అందరూ విఫలమవుతున్నా మెక్‌‌‌‌‌‌‌‌స్వీని మాత్రమే తప్పించడం విమర్శలకు దారి తీస్తుంది. జట్టు నుంచి తప్పించడంపై మెక్‌‌‌‌‌‌‌‌స్వీని నిరాశ వ్యక్తం చేశాడు.  

మెక్‌‌‌‌‌‌‌‌స్వీని మాట్లాడుతూ తన బాధను తెలిపాడు. "బాక్సింగ్ డే టెస్టులో ఆడాలన్న నా కల చెదిరిపోయింది. ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించి నా కలను నిజం చేసుకున్నాను. కానీ సరిగా ఆడలేకపోయాను. ఇదంతా ఆటలో భాగమే. నేను ఇక్కడితో ఆగను. నెట్స్ లోకి వెళ్లి కష్టపడి త్వరలోనే జట్టులో స్థానం సంపాదిస్తాను. వచ్చిన అవకాశాలను సరిగా ఉపయోగించుకోకపోతే జట్టులో స్థానం ఎప్పటికీ గ్యారంటీ కాదు. దురదృష్టవశాత్తు నా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాను". అని ఈ ఆసీస్ ఓపెనర్ తెలిపాడు. 

మెక్‌‌‌‌‌‌‌‌స్వీని స్థానంలో 19 ఏండ్ల యంగ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ సామ్‌‌‌‌‌‌‌‌ కొన్‌స్టస్‌ను తొలిసారి టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. ఒకవేళ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ డే టెస్ట్‌‌‌‌‌‌‌‌లో కొన్‌స్టస్‌ అరంగేట్రం చేస్తే 70 ఏళ్ల చరిత్రలో టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన యంగెస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టిస్తాడు. ఖవాజతో కలిసి కొన్‌స్టస్‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగొచ్చు. పింక్-బాల్ టెస్ట్‌కు ముందు కాన్‌బెర్రాలో టీమ్ ఇండియాతో జరిగిన ప్రైమ్ మినిస్టర్స్ XI ప్రాక్టీస్ గేమ్‌లో సామ్ కాన్స్టాస్ సెంచరీతో  ఆకట్టుకున్నాడు. దీంతో ఈ యువ బ్యాటర్ నాలుగో టెస్టుకు ఓపెనర్ గా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైంది.