వరదలో ఏడుగురు గల్లంతు

వరదలో ఏడుగురు గల్లంతు
  • వసైలో కొండచరియలు విరిగిపడ్డ చోట ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది రెస్క్యూ
  • ముంబైలో నిలిచిన లోకల్​ ట్రైన్స్
     

ముంబై : మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. 24 గంటలుగా పడుతున్న వానకు.. నాసిక్ జిల్లాలో ఏడుగురు గల్లంతయ్యారని, ఒకరి మృతదేహం దొరికిందని అధికారులు ప్రకటించారు. పేట్, సుర్​గానాతో పాటు త్రయంబకేశ్వర్ తాలుకాల్లో మంగళవారం నుంచి వర్షం కురుస్తూనే ఉందని తెలిపారు. డినోడోరీ తాలుకాలోని అల్​నంది నదిని దాటుతున్న సమయంలో.. ఆరేండ్ల చిన్నారి గల్లంతయ్యిందని వివరించారు. పేట్​ తాలుకాలోని మౌజీ పల్షీ ఖుర్ద్​ గ్రామంలో ఓ వ్యక్తి గోదావరి నదిలో కొట్టుకుపోయాడని ప్రకటించారు. నాసిక్​ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఇండ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సుర్​గానాలోని నార్​ నదిలో ఓ వ్యక్తి, శిలాపూర్​ గ్రామంలోని గోదావరి నదిలో మరొకరు గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు. మరో ఘటనలో మోటార్​ బైక్​పై​ వెళ్తున్న ఇద్దరు వరద  ప్రవాహంలో కొట్టుకుపోయారన్నారు. ఒకరి మృతదేహం దొరికిందని, మరొకరి కోసం రెస్క్యూ చేస్తున్నామని తెలిపారు. త్రయంబకేశ్వర్​.. మౌజే తాలేగావ్​లోని కిక్వి నదిలో ఒకరు గల్లంతైనట్టు వివరించారు. 

ముంబై అతలాకుతలం
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై అతలాకుతలం అవుతోంది. ముంబైతో పాటు చుట్టుపక్క ప్రాంతాలన్నీ నీట మునిగాయి. సిటీ లో భారీగా ట్రాఫిక్​ నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. హార్బర్​ లైన్​లోని సబర్బన్ సర్వీసులు నెమ్మదిగా నడుస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో లోకల్​ ట్రైన్​ సేవలు ఆపేశామని రైల్వే అధికారులు వివరించారు. అంధేరీ సబ్​వే నీట మునగడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారన్నారు. వెస్ట్రన్​ఎక్స్​ప్రెస్​ హైవేపై భారీగా ట్రాఫిక్​ జాం అయ్యిందని వివరించారు. బోరివలీ, గోరెగాం, జోగేశ్వరీతో పాటు అంధేరీలో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయానని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు.

పాల్గర్​లో విషాదం
కొండ చరియలు విరిగిపడి తండ్రి కూతురు చనిపోయిన ఘటన మహారాష్ట్రలోని పాల్గర్​ జిల్లా వసైలో చోటు చేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఫైర్​ డిపార్ట్​మెంట్​తో పాటు ఎన్​డీఆర్​ఎఫ్​ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజవళి ఏరియాలోని వగ్రల్​పాడాలో అనిల్​ సింగ్, తన భార్య వందన సింగ్​, కూతురు రోష్ని సింగ్​, కొడుకు ఓం సింగ్​తో కలిసి నివాసం ఉంటున్నాడని తెలిపారు. వారు ఉంటున్న ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో అనిల్​ సింగ్, రోష్ని సింగ్ చనిపోయారని వివరించారు. భార్య వందన, ఓం సింగ్​లు శిథిలాల కింద ఇరుక్కుపోగా.. స్థానికులు కాపాడి ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు.