భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఇంట్రానాసల్ కరోనా వ్యాక్సిన్ ఫేజ్ 1 ట్రయల్స్ కూడా వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి వచ్చింది. కోవ్యాక్సిన్‌తో పాటు ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్‌ను కూడా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. దీని కోసం సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి పనిచేసింది. బీబీవీ154 (ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్) ప్రిక్లినికల్ టెస్టింగ్‌ను పూర్తి చేసుకుందని భారత్ బయోటెక్ తెలిపింది.
ఫేస్ 1 హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్‌ను కూడా ఫిబ్రవరి లేదా మార్చి 2021 మధ్యలో ప్రారంభిస్తామని చెప్పింది. ఫేజ్ 1 హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్‌ను ఇండియాలోనే నిర్వహించనున్నట్టు వెల్లడించింది. సెయింట్ లూయిస్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అండ్ ట్రీట్‌మెంట్ ఎవాల్యుయేషన్ యూనిట్‌లో కూడా ఫేజ్ 1 ట్రయల్స్ జరగనున్నాయని కంపెనీ వర్గాలు చెప్పాయి. అమెరికా, జపాన్, యూరప్ తప్ప మిగిలిన అన్ని మార్కెట్లలో ఈ వ్యాక్సిన్‌ను డిస్ట్రిబ్యూట్ చేసే రైట్స్ భారత్ బయోటెక్ సొంతం చేసుకుంది. కోవ్యాక్సిన్‌తో పాటు ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌పై కూడా కంపెనీ ఫోకస్ చేసిందని భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా చెప్పారు. ఇంట్రానాసల్ వ్యాక్సిన్‌ను తేలికగా ఇవ్వగలగడమే కాకుండా.. నీడిల్స్, సిరంజీలు వంటి మెడికల్ పరికరాల వాడకాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. నీడిల్స్, సిరంజీలు వంటివి మొత్తం వ్యాక్సినేషన్ డ్రైవ్ ఖర్చును పెంచనున్నాయి.
