ఉమ్మడి మెదక్​ జిల్లాలో మూడు ఎకో టూరిజం స్పాట్స్‌‌‌‌

  • పోచారం, మంజీరా అభయారణ్యాలు,  నర్సాపూర్ అర్బన్ పార్క్ ను 
  • సెలెక్ట్ చేసిన ప్రభుత్వం ఎకో టూరిజం స్పాట్స్ తో మరింత డెవలప్ మెంట్

మెదక్​, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్​ జిల్లాలోని పోచారం వైల్డ్​ లైఫ్​ శాంక్చురీ, నర్సాపూర్​ అర్బన్​ ఫారెస్ట్ పార్క్​​, సంగారెడ్డి జిల్లాలోని మంజీరా వైల్డ్​ లైఫ్​ శాంక్చురీలను ఏకో టూరిజం స్పాట్​లుగా డెవలప్ చేయనున్నారు.  సహజ ప్రకృతి అందాలతో అలరారే ప్రదేశాలు, అరుదైన వన్య ప్రాణులు ఉన్న అడవులు, విదేశీ పక్షులు వలస వచ్చే జీవ వైవిధ్యం కలిగిన పర్యాటక  ప్రాంతాల్లో ఎకో టూ‌‌‌‌‌‌‌‌రిజం డెవలప్​ మెంట్​ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక పాలసీ రూపొందించింది.  రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 17 సర్య్కూట్​ లలో 64 ఎకో టూరిజం  స్పాట్​ లను గుర్తించారు. 

వన్యప్రాణులకు నెలవు.. పోచారం 

మెదక్, - కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం వైల్డ్​ లైఫ్​ శాంక్చురీ వివిధ వన్య ప్రాణులకు నెలవు. ఇక్కడ రెండు డీర్​ బ్రీడ్​ సెంటర్​లు ( జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాలు) ఉన్నాయి. దీంతో వందల సంఖ్యలో జింకలు ఉండగా, వాటితో పాటు నీల్​ గాయ్​లు, సాంబర్​లు, నెమళ్లు, కొండగొర్రెలు, ముళ్ల పందులు, కుందేళ్లు తదితర వన్యప్రాణులు ఈ అభయారణ్యంలో ఉన్నాయి. 

Also Read : పాలమూరు ప్యాకేజీ 3కి కొత్త అంచనాలు వాస్తవాలకు తగ్గట్టుగా రూపొందించండి

అడవి అందాలను తిలకించేందుకు రెండు వాచ్​టవర్​లు ఉండగా, అడవిలో తిరుగుతూ వన్యప్రాణులను చూసేందుకు వెహికిల్​ సదుపాయం ఉంది.  సందర్శకులు సేద తీరేందుకు వివిధ రకాల పచ్చని మొక్కలతో ఆహ్లదకరమైన పార్క్, వన విజ్ఞాన కేంద్రం ​ఉన్నాయి. సహజ ప్రకృతి అందాలతో అలరారే పోచారం వైల్డ్​ లైఫ్​ శాంక్చురీని ఎకో టూరిజం స్పాట్​ గా గుర్తించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. .

అడవిలో... అర్బన్​ పార్క్

హైదరాబాద్‌‌‌‌​ నగరానికి సమీపంలో ఉన్న నర్సాపూర్ సమీపంలో దట్టమైన అడవి ఉంది. 765 డి నేషనల్​ హైవేను ఆనుకుని ఉన్న ఇక్కడ ప్రభుత్వం అర్బన్ పార్క్ ను ఏర్పాటు చేసింది. ఫారెస్ట్​ డెవలప్​ మెంట్​ ఆధ్వర్యంలో రూ.20 కోట్లతో అడవిలో 2,765 హెక్టార్​ల విస్తీర్ణంలో అర్బన్​ పార్క్​ను డెవలప్​ చేశారు. ఏడు కిలోమీటర్ల మేర అడవి చుట్టూ ఫెన్సింగ్​ ఏర్పాటు చేసి, సందర్శకులు పార్క్​ లోకి వెళ్లేందుకు వీలుగా రెండు చోట్ల ఆకర్షణీయమైన గేట్​ లను ఏర్పాటు చేశారు. అర్బన్​ ఫారెస్ట్​ అందాలను తిలకించేందుకు వీలుగా 60 ఫీట్ల ఎత్తుతోవాచ్  టవర్​ నిర్మించారు. సందర్శకులు సేద తీరేందుకు ఆకట్టుకునే గజిబోలు, నీళ్లు పారే చోట వంతెనలు నిర్మించారు.

 విదేశీ పక్షుల వలస కేంద్రం..  మంజీరా

తొమ్మిది ద్వీపాల మధ్య అభయారణ్యంగా విస్తరించిన  మంజీరా చిత్తడి నేలగా గుర్తింపు పొందింది. 303 పక్షి జాతులు, మొసళ్ల సంతతిని పెంచే ప్రత్యేక కేంద్రంగా గుర్తింపు పొందిన మంజీరా నది సంగారెడ్డి జిల్లా కలబ్ గూర్ ప్రాంతంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జీవ వైవిధ్యం గల వాటిలో ఆంధ్రప్రదేశ్ కొల్లేరు సరస్సు ఒకటైతే తెలంగాణలో సంగారెడ్డి సమీపంలోని మంజీరా అభయారణ్యం రెండోది.  రాష్ట్ర ప్రభుత్వం మంజీరా ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్లేస్ గా గుర్తించి మరింత అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు  రూపొందిస్తోంది.   

303 పక్షి జాతులు

సంగారెడ్డి, సదాశివపేట, పుల్కల్, చౌటకూర్ మండలాల పరిధిలో దాదాపు 20 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న మంజీరా అభయారణ్యం వన్యప్రాణులకు కేంద్రంగా నిలిచింది. 303 పక్షి జాతులు ఇందులో ఉండగా, వాటిలో 117 జాతులు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇక్కడకు వలసకు వచ్చి వెళ్తుంటాయి. 

14 జాతులు ఉభయచరాలు, 57 రకాల చేప జాతులు, 32 రకాల సీతాకోక చిలుకలు, 25 రకాల ఆఖసేరుకాలు, 25 ఆర్కినీడ్లు, 28 రకాల ఓడోనెట్స్, 31 రకాల సరిసృపాలు ఇక్కడ ఉండడం విశేషం. అయితే చిత్తడి నేలలకు ప్రసిద్ధిగాంచిన మంజీరా ప్రాంతం వరదలను నియంత్రిస్తూ నీటి నుంచి వ్యర్ధాలను తొలగించి జీవ వైవిధ్యానికి తోడ్పడే విధంగా ఉండడం గమనార్వం.