Vikkatakavi Review: 'వికటకవి' వెబ్‌సిరీస్ రివ్యూ.. ఊహకందని ట్విస్ట్‌లతో తెలుగు డిటెక్టివ్ థ్రిల్ల‌ర్

న‌రేష్ అగ‌స్త్య‌ (Naresh Agastya), మేఘా ఆకాష్ (Megha Akash) కీల‌క పాత్ర‌ల్లో నటించిన డిటెక్టివ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ 'విక‌ట‌క‌వి' (Vikkatakavi). ఈ వెబ్ సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఫ‌స్ట్ టైమ్ ఓ డిటెక్టివ్ వెబ్‌సిరీస్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగిపోయాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో విక‌ట‌క‌వి వెబ్‌సిరీస్ ఇవాళ గురువారం(నవంబర్ 28న) తెలుగు,త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సిరీస్కు ప్ర‌దీప్ మ‌ద్దాలి ద‌ర్శ‌క‌త్వం వహించగా.. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేశారు. ఈ వెబ్‌సిరీస్ ఆడియన్స్ ఊహకందని ట్విస్ట్‌లతో, తెలంగాణ యాస, భాష‌ల‌తో ఆరు ఎపిసోడ్‌లలో సాగింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'కల్కి'సినిమాకి కథను అందించిన తేజ దేశ్‌రాజ్ ‘వికటకవి’ సిరీస్‌ను రాసాడు. 

కథేంటంటే::

హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల ప్రాంతంలోని 'అమరగిరి' అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఏదో శక్తి రూపంలో ఉండే ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. దాంతో ఆ గ్రామాల చుట్టూరా ఉన్న ప్రజల్లో తెలియని భయం వెంటాడుతుంటుంది. కథ కాస్తా వెనక్కి వెళితే.. 

శ్రీశైలం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురయ్యే గ్రామం కూడా అమరగిరి కావడంతో.. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఆదేశిస్తుంది. అప్పటికి దాదాపు పాతికేళ్ల కిందట ఆ ఊరికి సమీపంలో ఉన్న దేవతల గుట్టపై జాతర జరుగుతున్న సమయంలో పెద్ద వర్షం కురిసి 100మందికి పైగా ప్రజలు చనిపోతారు. దేవత శాపం వల్లే అలా జరిగిందని ఊరివాళ్లు నమ్ముతారు. అప్పటినుంచి ఆ గుట్ట పైకి ఎవరూ వెళ్లరు. ఒకవేళ పొరపాటున రాత్రివేళల్లో అక్కడ దేవతల గుట్ట (కొండ) మీదకు వెళ్లిన జనాలు గతం మర్చిపోతారు. ఇదంతా అమ్మోరు శాపం అని అమరగిరి ప్రజలు భావిస్తారు. 

ఇక ఈ ప్రాంతంలో ఉన్న భయాన్ని, అక్కడ నెలకొన్న స‌మ‌స్య‌ను సాల్వ్ చేయడానికి డిటెక్టివ్ రామకృష్ణ ఆ ఊరికి వెళ‌తాడు. ఇతను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. రామకృష్ణ తనదైన శైలిలో ఇన్వెస్టిగేషన్ చేసి అమరగిరి ప్రాంతాన్ని భయపెట్టేది.. కనబడని శక్తి హ ? లేక ముసుగువేసుకున్న మనుషులా? అని ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తాడు.

దాంతో అక్కడ ఉన్న రహస్యాలను వెలికితీసే క్రమంలో ఓ రోజు కొండ మీదకు వెళ్లిన రామకృష్ణకు ఏమైంది? అతను కూడా గతాన్ని మరిచిపోయాడా? లేదా దేవతల గుట్ట రహస్యాన్ని చేదించాడ? అనేది ఈ సిరీస్. అలాగే రామకృష్ణతో పాటు దేవతల గుట్ట మీదకు వెళ్లిన లక్ష్మి (మేఘా ఆకాష్) ఎవరు? అతనితో గుట్ట మీదికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తన వెనుకున్న కథేంటీ? అనేది తెలియాలంటే 'విక‌ట‌క‌వి' వెబ్‌సిరీస్ చూడాల్సిందే.

ఎలా ఉందంటే::

ఇప్పటికీ తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ, పీరియాడిక్ జోనర్లో థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఆరు ఎపిసోడ్‌లలో ‘వికటకవి’ సిరీస్‌ను డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన విధానం ఆసక్తిగా, ఆద్యంతం అలరించేలా ఉంది. ఇలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో సస్పెన్స్ మెయింటైన్ చేయడం, ఆడియన్స్ లో ఉత్కంఠ రేకిత్తించడం చాలా ముఖ్యం.

అందులో భాగంగానే ఫస్ట్ ఎపిసోడ్లో డిటెక్టివ్ రామకృష్ణ తెలివితేటలను, అమరగిరి ప్రజల్లో నెలకొన్న సమస్యను ఆలస్యం చేయకుండా చూపించి ఆసక్తి రేపాడు. దాంతో ప్రతి సిరీస్పై ఆడియన్స్లో ఇంటెన్స్ కలిగించాడు. ఇక తరువాతి మూడు ఎపిసోడ్స్లో దేవతల గుట్ట సమస్య పరిష్కారానికి రామకృష్ణ వేసిన ఎత్తులు చూపిస్తూనే.. ఊరి వాళ్ల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను, మధ్యరాత్రి దేవతల గుట్టమీదికి వెళ్లినాకా జనాల మతిమరుపును.. ఇలా ప్రతిదీ అర్థవంతంగా సస్పెన్స్గా తీర్చిదిద్దాడు.

రచయిత తేజ దేశ్‌రాజ్ ‘వికటకవి’ సిరీస్‌లో కనిపించే ప్రతి పాత్రకు ఓ పర్పస్ను రాసాడు. కథలో ట్విస్టులు ఊహించేలా ఉన్నా.. ఆడియన్స్ ఎంగేజ్ చేసేలా సిరీస్ను డైరెక్ట్ చేశారు ప్రదీప్. ముఖ్యంగా ‘వికటకవి’ సిరీస్‌ను తీసిన డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి.. రాసిన రచయిత తేజ దేశ్‌రాజ్కు మంచి పేరును తీసుకొస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎవరెలా చేశారంటే::

హీరో న‌రేష్ అగ‌స్త్య‌ జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన సినిమాలతో, వెబ్ సిరీస్ తో దూసుకెళ్తున్నారు. ఇక ఈ సిరీస్లో  డిటెక్టివ్ రామ‌కృష్ణ పాత్ర‌లో న‌రేష్ అగ‌స్త్య కనిపించి మెప్పించాడు. చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. డిటెక్టివ్ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. మేఘా ఆకాష్ పాత్రకు తగ్గట్టు నటించి ఒకే అనిపించారు. రఘు కుంచె, తారక్ పొన్నప్ప, షిజు అబ్దుల్ రషీద్, ముక్తార్ ఖాన్, అశోక్ కుమార్ ఇలా ప్రతి పాత్రధారులు తమ నటనతో క్యూరియాసిటీ కలిగించారు.

సాంకేతిక అంశాలు::

కథ రాసిన తేజ దేశ్‌రాజ్, తెరకెక్కించిన ప్రదీప్ మద్దాలి తమ స్క్రీన్ప్లేతో స్లో పాయిజన్‌లా ఎక్కించేశారు. వీరికి టాలీవుడ్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణ యాసలో థ్రిల్లర్ వెబ్ సీరీస్ తీసి.. ఆడియన్స్ ని హోల్డ్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. వీరి కథనానికి మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మరింత ప్రాణం పోశాడు.ఇక సినిమాటోగ్రాఫర్ షోయబ్ సిద్ధికి తనదైన కోణంలో విజువల్స్ను చూపించి అద్భుత ప్రతిభ కనబరిచాడు.

న‌రేష్ అగ‌స్త్య‌ సినిమాల విషయానికి వస్తే..

జయాపజయాలతో సంబంధం లేకుండా తనదైన సినిమాలతో, వెబ్ సిరీస్ తో దూసుకెళ్తున్నారు. మ‌త్తువ‌ద‌ల‌రా సినిమాలో పాజిటివ్‌గా క‌నిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌తో యాక్టర్గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత కిస్మత్, మెన్ టూ, హ్యాపీ బ‌ర్త్‌డే, సేనాప‌తి,పంచతంత్రం, పరువు, కలితో పాటు ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ రోల్స్ చేసి అలరిస్తూ బిజీయెస్ట్ యాక్టర్గా రాణిస్తున్నాడు.