నారాయణ పేటలో.. కంది రైతులకు కన్నీరే!     

  • నారాయణ పేట మార్కెట్ యార్డులో ఒక్కరోజే రూ. 2 వేల ధర తగ్గింపు 
  • ఖరీదుదారులు కుమ్మక్కయ్యారని ఆరోపణ
  • నిలిచిన కంది కొనుగోళ్లు

నారాయణపేట, వెలుగు:  నారాయణపేట జిల్లా  కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​ యార్డులో  సోమవారం కంది ధరలు తగ్గాయని రైతులు ఆందోళనకు దిగారు.  ఒక్క రోజే దాదాపు రూ.2 వేల వరకు ధర తగ్గడంతో ఖరీదుదారులు కుమ్మక్కై  రైతులను మోసం చేస్తున్నారంటూ యార్డు కార్యాలయం ఎదుట అన్నదాతలు నిరసనకు దిగారు. రైతులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగడంతో మార్కెట్ యార్డులో  ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి  రైతులను శాంతింపజేశారు.  కాగా ధర తగ్గడంతో కంది కొనుగోళ్లు నిలిచిపోయాయి. 

ఒక్కసారిగా తగ్గిన ధర..

నారాయణపేట జిల్లాలో కందిసాగు ఎక్కువగా ఉంటుంది. ఈ సారి ప్రభుత్వం ఎర్ర కందికి మద్దతు ధర రూ.7,888, తెల్ల కందికి రూ.8555గా ప్రకటించింది. ఈసారి మార్కెట్​లో కందులకు మంచి ధర వస్తుండటంతో గత గురువారం వరకు ఎర్ర కందులు గరిష్టం రూ.11 900, కనిష్టం రూ.10000 వరకు పలికాయి. తెల్ల కందులు రూ.12,500, కనిష్టం రూ.10,500 వరకు ధర పలికాయి. పేటలో కందులకు మంచి ధర వస్తుండటంతో వికారాబాద్​, కర్నాటక రైతులు కూడా ఇక్కడకు వచ్చి అమ్మకాలు చేస్తున్నారు. శుక్రవారం కందుల ధర రూ.200 నుంచి రూ500 వరకు తగ్గింది.

శనివారం కూడా అదే ధర కొనసాగగా.. మార్కెట్​లోకి ఎక్కువ మంది రైతులు కందులు తీసుకువచ్చారు. కానీ  కందులను ఖరీదు దారులు కొనుగోలు చేయలేదు.  సోమవారం మార్కెట్‌ కు  ఒక్కసారి 8వేల  కందుల బస్తాలు వచ్చాయి.  ఇదే అదనుగా కందుల ధర తగ్గిందంటూ ఖరీదుదారులు తక్కువ రేటు కోట్​ చేయటంతో సమస్య మొదలైంది.  క్వింటాలుకు రూ.8000 నుంచి గరిష్టంగా అక్కడక్కడ రూ.10786 లు ధర పలికింది. ఎక్కువ మంది రైతులకు దాదాపు రూ.8 వేల  నుంచి రూ. 9 వేల లోపే రావటంతో ధర తగ్గిందంటూ ఆందోళనకు దిగారు.

లేటుగా టెండర్లు...

మామూలుగా టెండర్లు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు యార్డు ఆఫీసు నుంచి కోటు ధర బయటకు రావాలి.  సోమవారం సాయంత్రం 4 గంటలకు కందుల రేట్ బయటకు రావటంతో అధికారులు, ఖరీదుదారులు కుమ్మక్కై ధర దించి టెండర్​ లేటుగా వేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీయ మార్కెట్​లో సోమవారం ధరలు ఒక్కసారిగా పడిపోవటంతోనే ఈసమస్య ఏర్పడిందని వ్యాపారస్తులు అంటున్నారు.  కందులు రెండు మూడు రకాలుగా ఉన్నా ధర మాత్రం ఒక్కో  రైతుకు ఒక్కో లాగా వేయటంతో ఇదేం పద్ధతని రైతులు వాపోయారు.  ఒక గ్రేడ్​, పద్ధతి లేకుండా ఖరీదుదారులు టెండర్​వేయకుండా ఇష్టం వచ్చినట్టు వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 


ధర తగ్గటంతో మార్కెట్​ చైర్మన్​ శివారెడ్డి, అధికారులు, ఖరీదుదారులను పిలిచి  రైతులతో చర్చలు జరిపారు. దేశీయ మార్కెట్​ ఆధారంగా తాము ధరలు వేస్తామని లేకపోతే తాము నష్టపోతామని ఖరీదుదారులు చెప్పగా,  రైతులు మాత్రం ఒక్కరోజు అందరూ కుమ్మక్కై ధరలు దించారని వారితో వాదనకు దిగారు.  ధర పెంచి తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్​ వారిని కోరారు.  తాము మరోసారి మార్కెట్ ఆధారంగా నిర్ణయించి తీసుకుంటామని ఖరీదుదారులు చెప్పారు.  రాత్రి అయినా ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారు. 

శనివారం టెండర్​ వేయకపోవడంతో నష్టం వచ్చింది

మార్కెట్​ యార్డుకు శనివారం కందులు తెచ్చాను. కానీ వ్యాపారస్తులు కందులకు టెండరు వేయలేదు.  వారికి ధర తగ్గుతుందని ముందే తెలిసి ఇలా ప్రవర్తించారని అనుమానం వస్తోంది.   శనివారం గనక టెండర్ వేస్తే  నాకు రూ.10 వేలకు పైగా ధర పలికింది. ఈరోజు టెండర్ చేయడం వల్ల ధర రూ. 8800కు వచ్చింది.  ‌‌ - రైతు హన్మంతు గడి మున్కన్ పల్లి , దామరగిద్ద మండలం