ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్.. నారాయణపేట DEO అబ్దుల్ ఘనీ సస్పెండ్

నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ హైస్కూల్‎లో 2024, నవంబర్ 20న ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‎ను ఆదేశించారు. ఓ వైపు ఈ ఘటనలో విచారణ జరుగుతుండగానే ఇవాళ (నవంబర్ 21) కూడా అదే మాగనూర్ హైస్కూల్‎లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. 

ఈ మేరకు నారాయణపేట డీఈవో అబ్దుల్ ఘనీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ఆర్డీవో రాంచందర్, ఎంపీడీఓ రహ్మతుదిన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అడిషనల్ కలెక్టర్ బెన్ శాలోమ్ తెలిపారు. భోజనం చేసే ఏజెన్సీ కాంట్రాక్ట్‎ను కూడా రద్దు చేశారు. కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయినప్పటికీ.. ఇవాళ కూడా మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళకు దిగారు.