ఖేడ్ నియోజకవర్గంలో సజావుగా ధాన్యం కొనుగోళ్లు : ఎమ్మెల్యే సంజీవరెడ్డి

నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. బుధవారం క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైస్ మిల్లర్లతో కుమ్మక్కై తాలు, తరుగు పేరిట రైతులకు తీరని నష్టం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు లబ్ధి జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే మండలాల్లో ఐకేపీ సెంటర్ల ద్వారా రెండు లక్షల పైచిలుకు క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేశామని చెప్పారు.

కోపరేటివ్ సొసైటీల ద్వారా కూడా కొనుగోలు జరుగుతున్నాయని రైతులకు నిజమైన లాభం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఈసారి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధం లేకుండానే రైతులు గతం కంటే 40% శాతం అధికంగా వరిని పండించారన్నారు. అనంతరం సిర్గాపూర్, కల్హేర్, శంకరంపేట మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, బోజిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.